Janwada Farm House Row : మరో టర్న్ తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు-key directions of telangana high court on raj pakala lunch motion petition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janwada Farm House Row : మరో టర్న్ తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Janwada Farm House Row : మరో టర్న్ తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Basani Shiva Kumar HT Telugu
Oct 28, 2024 05:29 PM IST

Janwada Farm House Row : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజ్ పాకాలకు 2 రోజులు టైం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టులో లంచ్‌ మోషన్‌ వేసిన రాజ్‌ పాకాలకు కాస్త ఊరట లభించినట్టు అయ్యింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

రాజ్‌ పాకాల లంచ్‌ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని.. హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్ వేశారు రాజ్‌ పాకాల. దీంతో పోలీసుల ముందు హాజరయ్యేందుకు రాజ్‌ పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని ఉన్నత న్యాయస్థానానికి ఏఏజీ వివరించారు. దీంతో నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో.. హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల. ఇటు రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు.. సోమవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అడ్రస్ ప్రూఫ్ తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు.

రాజ్ పాకాల విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సోమవారం మోకిలా పీఎస్‌కు హాజరు కాకపోతే బీఎన్ఎస్ 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. పార్టీని అరెంజ్ చేసిన రాజ్‌ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్‌ పాకాల, విజయ్‌ మద్దూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫామ్ హౌస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు అందరిని పిలవలేక పోయాడు. అందుకు దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. అది ఫ్యామిలీ ఫంక్షన్. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ.. కొంత మంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. మా అత్తమ్మ(70) కూడా అక్కడే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఒక కుటుంబం అంతా కలిసి అక్కడ ఉంటే రేవ్ పార్టీ అని ఎలా అంటారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.

Whats_app_banner