Telangana Cabinet : ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ - అజెండాలో కీలక అంశాలు, రైతు భరోసా విధివిధానాలపై నిర్ణయం..!
Telangana Cabinet Meeting : ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో… కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రైతు భరోసాపై కీలక నిర్ణయాలు…!
కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతు భరోసాపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికలపై పూర్తిస్థాయిలో సమాలోచనలు చేయనుంది. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 15 వేలు జమ చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో పాటు… మరిన్ని కొన్ని నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామని రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. పంట సాగు చేస్తేనే పెట్టుబడి సాయం అందించాలని సర్కార్ యోచిస్తోంది. అంతేకాదు.. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా శాటిలైట్ సేవల ద్వారా సాగు వివరాలను తెలుసుకునేలా కసరత్తు చేస్తోంది. పంటపెట్టుబడి సాయానికి సీలింగ్ విధించాలా వద్దా..? అనే దానిపై కూడా ఈ భేటీతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే రైతు భరోసా పథకం అమలు, విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం సబ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయ్యి చర్చించింది. సలహాలు, సూచనలు స్వీకరించింది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ లో చర్చించి… నిర్ణయాలను ప్రకటించనున్నారు.
ఇక రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా నివేదికను సమర్పించింది. అయితే దరఖాస్తుల స్వీకరణ, ఆదాయ పరిమితులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీపై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక రేషన్‌కార్డులపై సన్నబియ్యం పంపిణీ గురించి ప్రభుత్వం పరిశీలిస్తుండగా.. ఎప్పటి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చించనుంది.
ఇవాళ్టి కేబినెట్ భేటీలో…. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై కూడా చర్చ జరగనుంది. అంతేకాకుండా… టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయానికి కూడా బోర్డును ఏర్పాటు చేయటంపై నిర్ణయం తీసుకోనుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే, టూరిజం పాలసీతో పాటు మరికొన్ని అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.
మరోవైపు భూ భారతి బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. త్వరలోనే గవర్నర్ ఆమోదముద్ర వేస్తే చట్టంగా మారనుంది. అయితే ఈ చట్టాన్ని ఎప్పట్నుంచి అమల్లోకి తీసుకువస్తారనే దానిపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా..గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారుల నియామకంపై చర్చించనున్నారు.
హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపుపైనా మంత్రివర్గంలో చర్చకు అవకాశం ఉంది. తాజాగా సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… మల్లన్నసాగర్ నుంచే 20 టీఎంసీల నీటిని గోదావరి 2 ఫేజ్ కు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.