Bad Teacher: సిరిసిల్ల లో పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేసే ఉపాధ్యాయుడిపై పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించడంతో విచారణ చేపట్టారు. పిల్లలపై చేతులు వేస్తూ పైశాచిక ఆనందం పొందాడని ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడి తీరును భరించలేని విద్యార్థినులు ప్రిన్సిపల్ తో పాటు పేరెంట్స్ సమాచారం అందించారు. ఆగ్రహంతో పేరెంట్స్ పాఠశాలకు చేరుకుని కీచక టీచర్ ను మందలించారు. స్కూల్ లో ఏం జరుగుతుందని ప్రిన్సిపల్ ను నిలదీశారు.
విద్యార్థినులు, ప్రిన్సిపల్ అందరు కలిసి పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ అఖిల్ మహాజన్ రంగంలోకి దిగారు. పోలీస్ టీమ్ ను స్కూల్ కు పంపించి వివరాలు సేకరించారు. విద్యార్థుల ఇచ్చిన సమాచారంతో తెలుగు పండిత్ నరేందర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. విద్యార్థినిలు లేదా మహిళలు ఎక్కడైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టు అయిన టీచర్ నరేందర్ పై చర్యలు తీసుకునే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మండల విద్యాధికారి విచారణ జరిపి డిఈవో కు నివేదిక సమర్పించారు. ప్రకారం సస్పెన్షన్ కు ఉన్నతాధికారులకు నివేదించారు. జిల్లాలోనే మోడల్ గా ఆదర్శంగా నిలిచే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ దారి తప్పడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది
రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.