యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్-kcr yadadri tour ,తెలంగాణ న్యూస్

యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Feb 12, 2022 01:33 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యాదాద్రిలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా నూతన కలెక్టరేట్ భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారుల కృషి అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫోటో)
ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫోటో) (HT_PRINT)

యాదాద్రి దేవస్థానం సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన పలు కాటేజీలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రెసిడెన్షియల్ సూట్‌ను ప్రభుత్వం నిర్మించగా, దాతల విరాళాలతో కాటేజీలను నిర్మించారు. అనంతరం యాదాద్రిలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కలెక్టర్ కాంప్లెక్స్ సముదాయాన్నిప్రారంభించారు. కలెక్టర్ ఛాంబర్ లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

అద్భుతంగా అభివృద్ధి చెందే ప్రాంతం ఇది..

యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సమూదాయ ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ హల్ లో ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలనుకున్నప్పుడు ఛత్తీస్‌గఢ్ మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని పలుమార్లు సంప్రదించానని వివరించారు. ‘అక్కడ బస్తర్ అని జిల్లా ఉండేది. బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే కూడా పెద్దగా ఉండేది. పరిపాలన మారుమూలలకు చేరేదికాదు. దానిని నాలుగు జిల్లాలుగా మార్చారు. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు జిల్లా జనాభా ఉంటే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. భువనగిరి, యాదాద్రి చాలా రాపిడ్‌గా డెవలప్ అయ్యే ప్రాంతం. అంతా హైదరాబాద్‌తో కలగలిసి పోతుంది. ఈ కారిడార్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. అచ్చంపేట లాంటి ప్రాంతాల్లో రూ. 20, రూ. 30 లక్షలలోపు భూములు లభించే పరిస్థితి లేదని కేసీఆర్ అన్నారు. తాగునీరు, విద్యుత్తు సమస్యలన్నీ పరిష్కారమయ్యాక ఇక్కడికి వలసలు పెరిగాయని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర నిర్మాణంలో అధికారులంతా అద్భుతమైన కృషి చేశారని వివరించారు.

మిషన్ కాకతీయ ద్వారా, ప్రాజెక్టుల ద్వారా భూగర్భ జలాలు పెరిగాయని కేసీఆర్ వివరించారు. ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాముల ద్వారా భూములన్నీ సస్యశ్యామలమవుతున్నాయని వివరించారు. అనేకసార్లు మథనం చేసి మిషన్ కాకతీయను రూపొందించామని గుర్తు చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని వివరించారు. ప్రతి క్లస్టర్‌లో రైతు వేదికలు ఏర్పాటు చేశారంటూ చీఫ్ సెక్రటరీని ప్రశంసించారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారుల కృషి వల్లే అమలయ్యాయని వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మరింత పెరుగుదల

తెలంగాణ ఒక బ్రహ్మాండమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని కేసీఆర్ అన్నారు. ఉద్యోగుల వేతనాలు మరింత పెరుగుతాయని భరోసా ఇచ్చారు. ఆర్థిక పురోగతి సమకూరితే ప్రజలంతా భాగస్వాములవుతారని అన్నారు. 

రైతుబంధుతో వ్యవసాయాన్ని స్థిరీకరించామని, దళితబంధుతో దళితుల అభ్యున్నతికి పాటుపడుతామని వివరించారు. దళితబంధు ద్వారా కేవలం రూ. 10 లక్షలు ఇవ్వడం మాత్రమే కాదని, బార్, వైన్స్ తదితర కేటాయింపుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించామని వివరించారు.

95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వర్తించేలా మల్టీ జోనల్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. సర్వీసు రూల్స్ బుక్‌ను రెండు పేజీలకు సంక్షిప్తీకరించాలని, సరళీకరించాలని సూచించారు. 

రాజస్థాన్‌ను తలదన్నేలా తెలంగాణలో గొర్రెల పెంపకం సాగుతోందని కేసీఆర్ ప్రస్తావించారు. అన్ని పథకాల అమలులో అధికారుల కృషి ఉందని ప్రశంసించారు. 

భువనగిరి జిల్లా బిడ్డ ఉషారెడ్డి 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు ఆర్కిటెక్ట్‌గా ఉన్నారని కొనియాడుతూ ఆమెను పరిచయం చేశారు. 

WhatsApp channel

సంబంధిత కథనం