కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు అందాయి. జూన్ 5వ తేదీన విచారణకు రావాలని.. కేసీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే.
కాళేశ్వరం కమిషన్ సూచించిన విచారణ తేదీ సమయం దగ్గరపడిన నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 5వ తేదీన విచారణకు కాకుండా... జూన్ 11వ తేదీన కమిషన్ ఎదుట హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు కమిషన్ అంగీకరించింది.
నిజానికి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అన్న చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇదే విషయంపై నడుస్తున్న అనేక చర్చలకు కేసీఆర్…. పుల్ స్టాప్ పెట్టేశారు. జూన్ 11వ తేదీన విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేసీఆర్...కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.