ఇవాళ ‘కాళేశ్వరం కమిషన్‌’ ముందుకు కేసీఆర్‌ - ముఖ్యమైన 10 విషయాలు-kcr to appear before kaleshwaram commission inquiry this morning 10 key points here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఇవాళ ‘కాళేశ్వరం కమిషన్‌’ ముందుకు కేసీఆర్‌ - ముఖ్యమైన 10 విషయాలు

ఇవాళ ‘కాళేశ్వరం కమిషన్‌’ ముందుకు కేసీఆర్‌ - ముఖ్యమైన 10 విషయాలు

కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మాజీ సీఎం కేసీఆర్… కమిషన్ ముందుకు రానున్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన పలు అంశాలపై కమిషన్ విచారించనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బీఆర్కే భవన్‌ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు.

మాజీ సీఎం కేసీఆర్ (BRS)

కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు అధికారులను ప్రశ్నించిన కమిషన్… కొద్దిరోజుల కిందట మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను కూడా ప్రశ్నించింది. అయితే ఇవాళ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనుంది. ఇందుకోసం ఆయన… హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు రానున్నారు.

కమిషన్ ముందుకు కేసీఆర్ - ముఖ్యమైన అంశాలు:

  1. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
  2. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
  3. కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు చాలా మంది అధికారులను కమిషన్ విచారించింది. ముఖ్యంగా కాళేశ్వరం డిజైన్ల ఖరారు నుంచి నిర్మాణం వరకు కీలకంగా వ్యవహరించిన అధికారులు ఇందులో ఉన్నారు.
  4. బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది.
  5. ముందుగా కాళేశ్వరం కమిషన్ అధికారుల విచారణను పూర్తి చేసింది. ఆ తర్వాత అప్పటి ఆర్థిక శాఖమంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావుతో పాటు నాటి సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.
  6. జూన్ 6వ తేదీన ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
  7. జూన్ 9వ తేదీన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు.
  8. ఇందులో భాగంగా ఇవాళ (జూన్ 11) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్‌లో ఉదయం 11:30 గంటలకు ఈ విచారణ ప్రారంభంకానుంది.
  9. కేసీఆర్‌ విచారణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్కే భవన్‌లో ఆంక్షలు విధించారు.
  10. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేరుకున్నారు. లేఖ వివాదం తర్వాత… ఎమ్మెల్సీ కవిత కూడా ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. మరోవైపు బీఆర్కే భవన్ కు భారీ స్థాయిలో బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.