TS 9 Medical Colleges: ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ చేతులమీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి. కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో నేటి నుండి నూతన మెడికల్ కాలేజీలు నూతనంగా ప్రారంభమయ్యాయి.
''ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించిందని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ ప్రతి ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందన్నారు.
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని కేసీఆర్ అన్నారు.
పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ''వారికి ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించాం. మతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76శాతం ప్రసవాలు జరుగుతున్నాయి.'' అని కేసీఆర్ అన్నారు.
బోధన కాలేజీలే కాకుండా అనుబంధ ఆస్పత్రులను కూడా నెలకొల్పినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో 50 వేల పడకల్ని ఆక్సిజన్ బెడ్‌లుగా తయారు చేశామని స్పష్టం చేశారు. తెలంగాణను ఎగతాళి చేసినవాళ్లకు ఇదో మంచి ఉదాహరణ అని అన్నారు. దేశంలో వైద్య రంగంలో మూడో స్థానంలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో మరణాల రేటు కూడా తగ్గించామని చెప్పారు.
కొత్తగా ప్రారంభించిన వాటితో కలిపి రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య నాలుగు రెట్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 21కి చేరింది. కొత్త కాలేజీలతో కలిపి తెలంగాణలో మెడికల్ సీట్ల సంఖ్య 8,515కు పెరిగింది.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సీఎంఓఎస్డీ డా. గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎంఐడీసీ ఎం.డీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీలు దామెదర్ రావు, రాములు, కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు విప్ రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.