KCR Politics : కారు పార్టీ క్యాడర్‌లో జోష్.. రంగంలోకి గులాబీ బాస్!
KCR Politics : తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్‌గా లేక చాలా రోజులు అయ్యింది. ఇటీవల ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే.. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటారని చాలామంది కామెంట్ చేశారు. కానీ.. అతి త్వరలోనే కేసీఆర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తారనే టాక్ బీఆర్ఎస్‌లో నడుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఉనికిని చాటుకోలేకపోయింది. అప్పటి నుంచి ఒకట్రెండు సందర్భాలు మినహా.. కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకుంటారు.. పార్టీని కేటీఆర్, హారీశ్ రావు నడిపిస్తారనే కామెంట్స్ వినిపించాయి. కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం వేరే మాట చెబుతున్నారు. త్వరలోనే తమ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే కేసీఆర్ స్థాయిలో విమర్శలు చేయడం కరెక్ట్ కాదని పార్టీలో అంతర్గత చర్చలు జరిగినట్టు తెలిసింది. అందుకే కేసీఆర్ కాస్త మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. అయితే.. అందరు అనుకున్నట్టు కేసీఆర్ కామ్‌గా లేరని.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనితో పాటు.. ప్రభుత్వ వ్యతిరేకతపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్టీ నేతలతో సమావేశాలు..
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. కేసీఆర్ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీని వీడుతున్న లీడర్ల గురించి చర్చిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. అదే సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. బీఆర్ఎస్ కీలక నేతలు చెబుతున్నారు.
కవిత బయటకొచ్చాక రిలాక్స్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కవితకు ఈమధ్యే బెయిల్ వచ్చింది. కవిత బయటకొచ్చాక కేసీఆర్ కాస్త రిలాక్స్ అయ్యారని.. ఇక ప్రభుత్వం పనిపట్టడమేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వంపై ఒంటికాలితో లేస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. అటు నుంచి మాటల దాడి పెరిగినా తట్టుకొని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మంచి టైం చూసి..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇంకాస్త పెరిగాక.. సరైన ఇష్యూపై ఘాటుగా స్పందించాలని కేసీఆర్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అదే కాకుండా.. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. అప్పుడే విమర్శలు, ఆరోపణలు చేస్తే.. బాగుండదనే అభిప్రాయంలో కారు పార్టీ చీఫ్ ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ హామీల అమలు, ఇతర వైఫల్యాలపై ప్రశ్నిస్తూ.. ఓ భారీ కార్యక్రమం ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్..
ఇకనుంచి కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పార్టీ ప్రభావం చూపకపోతే.. కేడర్‌లో నమ్మకం సన్నగిల్లి.. తర్వాత వచ్చే ఎన్నికల్లో నష్టపోతామనే భావనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం నష్టం జరిగినా.. కేడర్‌ను కాపాడుకోవడం కష్టం అని.. అందుకే ఫుల్ ఫోకస్ పెట్టి ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు.
కేసీఆర్‌కు కీలక సమాచారం..
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నా.. కేసీఆర్‌కు సమాచారం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. పదేళ్లు ప్రభుత్వ చీఫ్‌గా ఉన్న కేసీఆర్‌కు కొందరు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ ఉంది. అందుకే.. ప్రస్తుత ఇంటలిజెన్స్ అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. సీఎం పేషీ, సెక్యూరిటీ, ఇతర కీలక బాధ్యతల్లో గతంలో కేసీఆర్‌కు దగ్గరగా పనిచేసిన వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. దీంతో చాలామంది అధికారులను మార్చారు. అటు రేవంత్ రెడ్డి కూడా తన సమాచారం లీక్ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎలా ఉన్నా.. కేసీఆర్‌కు మాత్రం అన్ని విషయాలపై పక్కా సమాచారం వస్తుందని తెలుస్తోంది. అన్నింటిని క్షుణ్నంగా పరిశీలించి.. త్వరలోనే గులాబీ బాస్ రీ ఎంట్రీ ఇస్తారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.