మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఉదయమే ఫామ్ హౌస్ నుంచి బయల్దేరిన కేసీఆర్ … హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాలకు పైగా కేసీఆర్ విచారణ కొనసాగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగం వంటి పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్ల ద్వారా పీసీ ఘోష్ కమీషన్ కు వివరాలను చెప్పినట్లు సమాచారం.
విచారణలో భాగంగా… కాళేశ్వరం ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కూడా కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల మేరకు తెలిసింది. విచారణ ముగిసిన తర్వాత… మీడియాతో మాట్లాడలేదు. నేరుగా కారులో ఎక్కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో… పార్టీ శ్రేణులు, నేతలకు కేసీఆర్ అభివాదం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు. ఇవాళ ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కింద పడిపోయారు. ఈ క్రమంలో కాలికి గాయమైంది. వెంటనే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన తర్వాత… కేసీఆర్ నేరుగా యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పల్లాను పరామర్శించారు.