KCR Comments : నో డౌట్...! వచ్చే ఎన్నికల్లో వంద శాతం మనదే అధికారం - కేసీఆర్ వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో 100 శాతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవెల్లి ఫౌమ్ హౌస్ లో మాట్లాడిన ఆయన.. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో వంద శాతం మనమే అధికారంలోకి వస్తామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామెంట్స్ చేశారు. శనివారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పాలకుర్తి నియోజకవర్గ బిఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేసీఅర్ సమావేశం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్ విజయం సాధిస్తుందనటంలో ఎలాంటి అనుమానమే లేదన్నారు.
ప్రజలు ఏమి కోల్పోయారో వారికి అర్ధం అయ్యిందని కేసీఆర్ చెప్పారు. అన్ని జిల్లాలో జనం చెబుతున్నారని… మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పటికే కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అందరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి..విన్నీ లోపల వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ విధానం కాదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అంటే అందర్నీ కాపాడాలని.... వ్యవస్థలను నిర్మాణము చేయాలన్నారు. పదిమందికి లాభం చేకూర్చే పనులను చేయాలన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అంతా చూస్తున్నారని కేసీఆర్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో మనం మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమే అని గుర్తు చేశారు. కానీ 90 శాతము ఎవరు ఆడగకున్న పనులు చేసి చూపించామన్నారు. తిట్లు అటువైపు వాళ్లకు మాత్రమే రావని… మనకు కూడా వచ్చని చెప్పారు.
అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదన్న కేసీఆర్.. నిర్మించడానికి అని చెప్పారు. రౌడీ పంచాయితీలు చేయడం తమకు కూడా తెలుసని కామెంట్ చేశారు. ప్రజలను కాపాడాల్సింది పోయి.. భయపెడతారా అని ఫైర్ అయ్యారు. ప్రజలు సేవ చేసే బాధ్యతను అప్పగించారని.. అంతే బాధ్యతతో ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ సమావేశం సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జనంలోకి కేసీఆర్…!
మరోవైపు 2025 జనవరి నుంచి గులాబీ బాస్ రంగంలోకి దిగుతారని.. బీఆర్ఎస్ కీలక నేతలు చెబుతున్నారు. కొత్త సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరానికి కేసీఆర్ సిద్ధమయ్యారని అంటున్నారు. ఇక కొత్త సంవత్సరం నుంచే పార్టీ కొత్త కమిటీలు వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచి.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారంట..!
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇంకాస్త పెరిగాక.. సరైన ఇష్యూపై ఘాటుగా స్పందించాలని కేసీఆర్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అదే కాకుండా.. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. అప్పుడే విమర్శలు, ఆరోపణలు చేస్తే.. బాగుండదనే అభిప్రాయంలో కారు పార్టీ చీఫ్ ఉన్నట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ హామీల అమలు, ఇతర వైఫల్యాలపై ప్రశ్నిస్తూ.. ఓ భారీ కార్యక్రమం ద్వారా కేసీఆర్ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.