KCR Birthday : కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో : కేటీఆర్-kcr birthday celebrations in grand style at telangana bhavan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Birthday : కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో : కేటీఆర్

KCR Birthday : కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో : కేటీఆర్

Basani Shiva Kumar HT Telugu
Published Feb 17, 2025 01:44 PM IST

KCR Birthday : తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌, హరీష్‌రావు 71 కిలోల కేక్‌ కట్‌ చేశారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.

కేటీఆర్
కేటీఆర్

కేసీఆర్ కడుపున పుట్టడం తన పూర్వజన్మ సుకృతం అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో అని అభివర్ణించారు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు.. మద్దతు లేదు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.

కారణజన్ముడు కేసీఆర్..

'చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో. చావు నోట్లో తల పెట్టిన కారణజన్ముడు కేసీఆర్. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన్ను సీఎం చేసేందుకు ఒక లక్ష్యంతో ముందుకెళ్దాం. తెలంగాణ పసిగుడ్డును మళ్లీ కేసీఆర్ చేతిలోపెడదాం' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కేసీఆర్ వైపు చూస్తున్నారు..

'కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం. కేసీఆర్‌ పట్టుదల వల్లే తెలంగాణ వచ్చింది. సీఎం రేవంత్‌ 20 ట్వంటీ మ్యాచ్‌లు ఆడుతున్నారు. పైసల కోసమే రేవంత్‌ ఆడుతున్నారు. రేవంత్‌రెడ్డి ఆట అంతా తొండి ఆట. ఎన్ని రోజులు పదవిలో ఉంటారో రేవంత్‌కే తెలియదు. కేసీఆర్‌ అన్ని రకాల మ్యాచ్‌లు ఆడుతారు. టీ20తో పాటు టెస్టులు కూడా కేసీఆర్‌ ఆడుతారు. ప్రజలందరూ కేసీఆర్‌ వైపు చూస్తున్నారు' అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

నాకు ఏడుపొచ్చింది..

'తెలంగాణ కోసం కేసీఆర్‌ దీక్ష చేసినప్పుడు ఆయనను చుస్తే నాకు ఏడుపొచ్చింది. అప్పటికి కేసీఆర్ నిరాహార దీక్ష చేసి 11 రోజులైంది. కంట్రోల్‌లో లేడు. వణుకుతున్నాడు. కానీ పట్టుదల మాత్రం వీడలేదు. అప్పుడు ఆయనను చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి' అని హరీష్ రావు గుర్తు చేసుకున్నారు.

రేవంత్ శుభాకాంక్షలు..

'గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

జగన్ ట్వీట్..

'తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం, ఆనందం, సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని ఏపీ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner