South Central Railway : కాజీపేట డివిజన్ ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు.. నేతలు పట్టుపడితే సాధ్యమే!
South Central Railway : కేంద్రం విశాఖను.. రైల్వే డివిజన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌గా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్‌కు.. డివిజన్ హోదా దక్కుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించింది. దీంతో కాజీపేట డివిజన్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాజీపేట కేంద్రంగా డివిజన్ చేస్తామని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జోన్ ఏర్పడింది. దీనివల్ల కొన్ని డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే నుంచి విశాఖ జోన్‌కు వెళతాయి.
హోదా దక్కే అవకాశం..
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల దక్షిణ మధ్య రైల్వేకు కొత్తగా మరో డివిజన్‌ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది కాజీపేటకు దక్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కాజీపేటకు డివిజన్ హోదా స్థానిక ప్రజా ప్రతినిధులకు పరీక్షగా మారింది. ఏపీకి చెందిన నాయకులు పట్టుపట్టి జోన్‌ను సాధించుకున్నారు. దీన్ని స్పూర్తిని తీసుకుని ఇక్కడి నేతలు ఒత్తిడి తేగలిగితే.. త్వరలోనే డివిజన్ హోదా అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విజయవాడకు బదిలీ చేసే ఛాన్స్..
ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మొటుమర్రి నుంచి కొండపల్లి మార్గాన్ని.. విజయవాడ డివిజన్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇటు ఆలేరు నుంచి కాజీపేట, కాజీపేట నుంచి బల్లార్ష, కాజీపేట నుంచి ఖమ్మం, డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్, పెద్దపల్లి నుంచి నిజమాబాద్ వరకు.. కాజీపేట డివిజన్‌లో చేర్చుకోవడానికి అవకాశం ఉంది. కొత్తగా రామగుండం- మణుగూరు, కాజీపేట- కరీంనగర్ మార్గాలు కూడా కాజీపేట పరిధిలోకి రానున్నాయి.
కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు..
మహా కుంభమేళాను పురస్కరించుకుని వరంగల్ స్టేషన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు.. అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లను మచిలీపట్నం- దానాపూర్- మచిలీపట్నం మధ్య నడిపిస్తున్నారు. ఈ నెల 8, 16వ తేదీన నంబర్ 07113తో మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 11.00కు బయలుదేరే రైలు.. మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది.
రిజర్వేషన్ ప్రారంభం..
తిరిగి ఈ నెల 10, 18 తేదీల్లో 07114 నంబర్‌తో దానాపూర్‌లో మధ్యాహ్నం 3.15కు బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 3.00 గంటలకు మచిలీపట్నం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. వీటికి కేవలం 3 ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.