UPSC Civils 27th Ranker : పేదింటి కుర్రోడు సివిల్ సర్వీసెస్ (UPSC Civils 2023)పోటీ పరీక్షలో మెరిశాడు. ఆల్ ఇండియాలో 27వ ర్యాంకు సాధించి కరీంనగర్ జిల్లా(Karimnagar)కే వన్నె తెచ్చారు. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలలో(Civil Services Results) ఆల్ ఇండియా 27వ ర్యాంకు సాధించారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదరికం అడ్డుకాదని సాయికిరణ్ నిరూపించారు. సాయి వరంగల్ ఎన్ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే ఆన్ లైన్ కోచింగ్ తీసుకున్నాడు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు అటెండ్ కాగా తొలి ప్రయత్నంలో విఫలమైన సాయి, రెండో ప్రయత్నంలో 27వ ర్యాంక్ సాధించి సక్సెస్ అయ్యారు.
చేనేత (Weaver)కార్మిక కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ ప్రైమరీ విద్య వెలిచాలలోని సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో, హైస్కూల్ విద్యతేజ హైస్కూల్ లో, ఇంటర్ కరీంనగర్ లోని ట్రినిటీ కళాశాలలో చదివారు. తల్లి లక్ష్మి ఇప్పటికీ బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది. తండ్రి కాంతారావు చేనేత కార్మికునిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. క్యాన్సర్ బారినపడి 2016లో మృతి చెందాడు. సాయి అక్క స్రవంతి ప్రస్తుతం ఏఈఈగా ఉద్యోగం చేస్తుంది. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ పిల్లలిద్దరూ చదువుల్లో రాణిస్తూ పెద్ద ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలువడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయి, చిన్నప్పటినుంచే చదువులో రాణించేవారు. చదువుకు పేదరికం అడ్డుకాదని కష్టపడి చదివాడు. తల్లిదండ్రుల కష్టంలో పాలు పంచుకున్న సాయి చిన్నప్పటి నుంచే కలెక్టర్(Collector) కావాలనే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగి సక్సెస్ అయ్యాడని తల్లి లక్ష్మి సోదరి స్రవంతి తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న సాయితో తన ఆనందాన్ని పంచుకుని అభినందనలు తెలిపారు. 27వ ర్యాంక్ సాధించిన సాయి బుధవారం స్వగ్రామానికి రానున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాలు(UPSC Civils 2023 Results) విడుదల అయ్యాయి. సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య తన ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంకు(UPSC AIR 3rd Rank) సాధించారు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు రావడంపై అనన్య రెడ్డి (Donuru Ananya Reddy)సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజులు 12-14 గంటలు చదివేదానినని ఆమె తెలిపారు. సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
HT Correspondent K V.REDDY, karimnagar
సంబంధిత కథనం