UPSC Civils 27th Ranker Interview : నా తల్లిదండ్రుల కష్టమే ఈ విజయానికి కారణం, సివిల్స్ 27వ ర్యాంకర్ సాయి కిరణ్ ఇంటర్వ్యూ
UPSC Civils 27th Ranker Interview : యూపీఎస్సీ సివిల్స్ లో కరీంనగర్ కుర్రాడు సాయి కిరణ్ ప్రతిభ చూపారు. జాతీయ స్థాయిలో 27వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రుల కష్టమే తనను ఈ స్థాయికి చేర్చిందంటున్న సాయి కిరణ్ తో హెచ్.టి.తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ.
UPSC Civils 27th Ranker Interview : యూపీఎస్సీ ఫలితాల్లో (UPSC Civils Results)కరీంనగర్(Karimnagar Youth 27th Rank)జిల్లాకు చెందిన పేదింటి కుర్రాడు తన ప్రతిభను చాటుకున్నారు. కోచింగ్ లేకుండా వెలిచాలకు చెందిన నందాల సాయికిరణ్(Civils 27th Ranker Sai Kiran) ఆలిండియాలో 27వ ర్యాంకు సాధించారు. ఆదర్శ గ్రామంలో పుట్టి అద్భుతమైన ర్యాంక్ సొంతం చేసుకున్న సాయికిరణ్ స్వగ్రామం వెలిచాలలో ఆనందోత్సాహాలు వెల్లువిరిచాయి. సాయి కిరణ్ ను గ్రామస్థులు, బంధుమిత్రులు అభినందించి శాలువాతో సత్కరించారు. సాయి కిరణ్ తల్లి బీడి కార్మికురాలు కాగ, తండ్రి కాంతయ్య నేత కార్మికుడు. 8 ఏళ్ల క్రితం క్యాన్సర్ తో కాంతయ్య మృతి చెందగా ఇద్దరు పిల్లలను కష్టపడి చదివించారు తల్లి లక్ష్మి. తల్లి కష్టం తీర్చేందుకు కలెక్టర్ అయ్యేలా చదివిన సాయికిరణ్ ను కదిలిస్తే ఐఏఎస్ అవుతానని ఊహించలేదంటున్నారు. ఐఏఎస్ గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అందరికీ అందేలా, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కృషి చేస్తానంటున్న సాయికిరణ్ తో హెచ్.టి.తెలుగు ప్రతినిధి విజేందర్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ.

హెచ్.టి.తెలుగు ప్రతినిధి : 27వ ర్యాంకు రావడంపై ఎలా ఫీలవుతున్నారు?
సాయికిరణ్ : ఎగ్జైటింగ్ గా ఉంది.. ఎమోషనల్ డేస్..కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నాను. ఇప్పటి నుంచి బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి.
హెచ్.టి.తెలుగు ప్రతినిధి : కోచింగ్ లేకుండా 27వ ర్యాంక్ ఎలా సాధ్యం?
సాయికిరణ్ - కోచింగ్ తీసుకుంటేనే సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు వస్తాయనడం తప్పు.. కోచింగ్ లేకుండా తనలాంటి వారు చాలా మంది సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. కావాల్సింది ఏమిటంటే ఎగ్జామ్ ను కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ కు ఏం కావాలి...దాన్ని బట్టి మనం ఎలా ఓరియంటెడ్ కావాలి. అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి. ఫస్ట్ మనలో మనకు నమ్మకం ఉండాలి. మనం ఒక గోల్ పెట్టుకుని దానికి అనుగుణంగా వర్క్ చేస్తే.. కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తే ఒక ప్రాసెస్ గా ముందుకెళ్తే ఏదైనా చేయవచ్చు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే.
హెచ్.టి.తెలుగు ప్రతినిధి : ఐఏఎస్ గా మీ లక్ష్యం ఏమిటి?
సాయికిరణ్ - హెల్త్ అండ్ ఎడ్యుకేషన్..ఉమెన్ ఎమ్పర్మెంట్..గ్రామీణ అభివృద్ధి సెక్టార్ లను బాగు చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే చాలా హ్యాపీ. సమీకృత అభివృద్ధి జరగాలి.. అభివృద్ధి ఫలాలు సొసైటీలో అందరికి వెళ్లాలన్నదే నా లక్ష్యం. అందరికీ ఒక అవకాశం రావాలని కోరుకుంటున్నా.. అందులో ప్రభుత్వ పాత్ర పెద్దది...ఆ డైరెక్షన్ లో పనిచేయాలనేది నా లక్ష్యం.
హెచ్.టి.తెలుగు ప్రతినిధి : పేదరికం నుంచి పై కొచ్చారు.. ఎలాంటి కష్టాలు అనుభవించారు?
సాయికిరణ్ - తల్లిదండ్రుల కష్టపడితేనే పూట గడిచేది. అలాంటి పరిస్థితులు ఉన్నా నా చదువుకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా పేరెంట్స్ చదివించారు. అక్క స్రవంతి, నేను చదువులో మెరిట్ స్టూడెంట్ గా ఉన్నాం. కన్నవారి కష్టాలను కళ్లారా చూసిన నేను వారి శ్రమ వృథా కాకుండా కష్టపడి చదివాను. వరంగల్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం చేయడంతో ఆర్థికంగా నిలదొక్కుకోగలిగాను. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ముందుకు సాగాను. ఫస్ట్ అటెంప్ట్ లో లక్ష్యం నెరవేరలేదు. రెండో అటెంప్ట్ సమయంలో ఈసారి రావాలి, లేకుంటే మరోసారి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ కానని భావించాను. కానీ రెండో అటెంప్ట్ లోనే లక్ష్యాన్ని ఛేదించాను. హ్యాపీగా ఉంది.
హెచ్.టి.తెలుగు ప్రతినిధి : నేటి యువత కు మీరు ఇచ్చే సలహా ఏమిటి?
సాయికిరణ్ - యువతను నేను కోరేది ఒకటే.. కష్టపడితే ఫలితం తప్పక ఉంటుంది. సమయం వృథా చేయకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని క్రమపద్ధతిలో చదివితే తప్పక అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. కుటుంబం కోసం నేను ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యాను. కష్టం అయినా ఇబ్బంది పడకుండా సమయం వృథా కానివ్వకుండా ముందుకెళ్లడంతో ఈరోజు 27వ ర్యాంకు సాధించగలిగాను. కోచింగ్ కు వెళ్తేనే.. మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటేనే ర్యాంకులు వస్తాయనే భావన నుంచి బయటికి వచ్చి మన లక్ష్యం ముందు ఏదైనా చిన్నదిగానే భావించి ముందుకెళ్తే తప్పక ఫలితం ఉంటుంది. అందుకు నేనే సింపుల్ ఎగ్జాంపుల్.
HT Correspondent K.V.REDDY, Karimnagar
సంబంధిత కథనం