Karimnagar News : కరీంనగర్ లో అరుదైన ఘటన, కలెక్టర్ హోదాలో తల్లికి పతకం అందజేసిన కూతురు
Karimnagar News : యోగా పోటీల్లో సత్తా చాటిన తల్లి.. కలెక్టర్ హోదాలో ఉన్న కూతురు చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. ఈ అరుదైన ఘటన కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్ లో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
కూతురు కలెక్టర్, తల్లి సాధారణ మహిళ. కానీ ఇద్దరు ఒకే వేదిక పైకి చేరుకుని ప్రతిభను చాటుకున్నారు. సాధారణ మహిళగా కలెక్టర్ తల్లి యోగాలో అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం గెలుచుకున్నారు. పతకం గెలుచుకున్న తల్లికి కలెక్టర్ హోదాలో కూతురు పతకం అందజేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ అరుదైన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది.
కరీంనగర్ జిల్లా క్రీడలు యువజన శాఖ, యోగా అసోసియేషన్ సంయుక్తంగా కరీంనగర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 300 మంది ఉద్యోగస్తులు, క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులతోపాటు ఉద్యోగస్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మాతృమూర్తి ప్రవమయి ఆచార్య యోగపై ఉన్న మక్కువతో ఓ సాధారణ క్రీడాకారిణిగా పోటీలో పాల్గొన్నారు. నిత్యం తాను వేస్తున్న ఆసనాలను పోటీల సందర్భంగా ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. కూతురు కలెక్టర్ ముందు ప్రదర్శించే వేదిక దొరికిందని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్వితీయ ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. కలెక్టర్ అయిన కూతురు పమేలా సత్పతి చేతుల మీదుగా పతకంతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఇది తమ జీవితంలో మరుపురాని ఘట్టమంటూ ఇరువురు వ్యాఖ్యానించారు.
ఉద్యోగులకు యోగా శిక్షణ- కలెక్టర్ పమేలా సత్పతి
అలసటను దూరం చేస్తూ మానసిక దృఢత్వాన్ని అందిస్తూ, నిత్య నూతన ఉత్సాహాన్నిచ్చే యోగాలో జిల్లాలోని ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా శిక్షణ వచ్చే నూతన సంవత్సరం నుండి నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యోగా మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపద అని తెలిపారు. యోగాతో కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా సార్వత్రిక శక్తి అలవర్చుకునే అవకాశం ఉందని నేటి సమాజంలో వయసుకు అనుగుణంగా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనడం, యోగా చేయడం తప్పనిసరి అన్నారు. తనకు యోగా అంటే అమిత అభిమానమని అవకాశం ఉంటే క్రీడాకారిణీగా, కనీసం జట్టుకు మేనేజర్ గానైనా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని ఉందని అభిలాషించారు. 30 ఏళ్ళ వయసు వచ్చేవరకు జీవితంలో ఏమి చేయలేదో, ఏమి చేయాలో యోగా చెబుతుందన్నారు. పాఠశాలలు, ఇళ్లలో పిల్లలు కేవలం ధ్యానానికే పరిమితం కాకుడదని, యోగాతో అనంత ప్రతిభ సొంతం చేసుకోవాలన్నారు.
చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు చూస్తే ఆనందం, గర్వంగా ఉందన్నారు. వీరిలో ఎముకలు , కండరాలు ఉన్నాయా అనే సందేహంతో రబ్బర్ బాండ్ లా సాగుతూ చేసిన యోగాసనాలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనం అన్నారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయిలో జిల్లాకు చెందిన దీపక్ కు స్వర్ణ పథకం సాధించిన స్ఫూర్తితో జిల్లా క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలన్నారు.
కరోనా నుంచి కాపాడిన యోగా
కరోనా సమయంలో యోగాతో చాలామంది ఆరోగ్యంగా ఉండి ప్రాణాలను కాపాడుకున్నారని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తెలిపారు. నవ్వడం కూడా యోగాలో ఒక భాగమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షులు సర్దార్ రవీందర్ సింగ్, కార్యదర్శి కన్న కృష్ణ పాల్గొని జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో స్వర్ణ పతక విజేత దీపక్ ను, కోచ్ రామకృష్ణను ఘనంగా సన్మానించారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం