Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం - బండి సంజయ్-karimnagar union minister bandi sanjay ultimatum to state govt fee reimbursement payment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం - బండి సంజయ్

Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Dec 29, 2024 08:43 PM IST

Bandi Sanjay : సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయి రూ.7 వేల కోట్లు చెల్లించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక ఆర్ఆర్ఆర్ టెండర్లు అన్నారు.

సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం - బండి సంజయ్
సంక్రాంతి లోపు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించాల్సిందే, లేకుంటే మహోద్యమం చేపడతాం - బండి సంజయ్

Bandi Sanjay : సంక్రాంతి లోపు ‘ఫీజు రీయంబర్స్ మెంట్’’ బకాయి ఏడు వేల కోట్లు చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచుతామని అల్టిమేటం ఇచ్చారు. మన్మోహన్ సింగ్, పీవీ నర్సింహారావును అవమాన పరిచిన కాంగ్రెస్ కు ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.

yearly horoscope entry point

కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ‘దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్’ పేరిట బండి సంజయ్ నిర్వహించిన కోచింగ్ సెంటర్ లో చదువుకుని ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానించి అభినందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసిన సంజయ్, బిశ్వాల్ కమిటీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి 4 ఏళ్లయినా... వాటిని భర్తీ చేయలేయలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గప్పాలు కొడుతూ టైంపాస్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. 25 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి... 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గప్పాలు కొడుతోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఉద్యోగాల్లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు.

కేంద్రం 9.22 లక్షల ఉద్యోగాలు భర్తీ

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2022 అక్టోబర్ లో ప్రకటించింది. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 9.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని బండి సంజయ్ తెలిపారు. అభ్యర్థులకు అపాయిట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చిందని, కానీ యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఇచ్చిన హమీలన్నీ కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తామని మాట తప్పిందని, ఒక్కో నిరుద్యోగికి రూ.48 వేలు బకాయి పడిందని, వెంటనే ఆ బకాయి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయని పక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళనలు చేసేందుకు సిద్ధమౌతున్నారు.

ఆర్ఆర్ఆర్ కు ధన్యవాదాలు

ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్రమోదీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రం ఇచ్చిన సంక్రాంతి కానుక అన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి దాదాపు రూ.18 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా ఆ మొత్తాన్ని కేంద్రం భరించేందుకు సిద్దమైందని తెలిపారు.

పీవీ, మన్మోహన్ లను కాంగ్రెస్ అవమానించింది

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కాంగ్రెస్ రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్లు సూపర్ ప్రధానిగా సోనియాగాంధీ కొనసాగుతూ రబ్బర్ స్టాంప్ గా మార్చారన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రజాప్రతినిధ్యం చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే.. ఆ ఆర్డినెన్స్ కాపీలను రాహుల్ గాంధీ చింపివేసి మన్మోహన్ ను దారుణంగా అవమానించారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు ఢిల్లీలోనే స్మారక స్థల్ నిర్మించేందుకు సిద్దమైందన్నారు. కానీ మాజీ ప్రధానిగా పనిచేసిన పీవీ నర్సింహరావు అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహించకుండా అవమానించిన కాంగ్రెస్ నాయకులకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.

సంజయన్నకు రుణపడి ఉంటాం

బండి సంజయ్ నిర్వహించిన ఫ్రీ కోచింగ్ తో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తూ సంజయ్ అన్నకు జీవితకాలం రుణపడి ఉంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు రాగుల నగేశ్ (జూనియర్ లెక్చరర్), అమర్ నాథ్ యాదవ్ (స్కూల్ అసిస్టెంట్), రాజశేఖర్, వెంకటేశ్ (సీఆర్పీఎఫ్), కార్తీక్, ప్రియాంక (గ్రూప్ 4) మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది మాతోసహా ప్రతి పేదవాడి కళ అని తెలిపారు. డబ్బుల్లేక కోచింగ్ తీసుకునే స్తోమత లేక ఆగిపోయిన తమకు బండి సంజయ్ మా కోసం ముందుకొచ్చి ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఉచిత భోజన, వసతి కల్పించారని చెప్పారు. లక్ష వ్యయమయ్యే కోచింగ్ ను ఉచితంగా అందించారని బండి సంజయ్ వల్ల ఈరోజు ఉద్యోగం సాధించామని జీవిత కాలం రుణపడి ఉంటామన్నారు. పేదలకు చేస్తున్న మేలును ఎన్నటికీ మరువలేమని పేర్కొన్నారు. హైదరాబాద్ వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకునే స్థోమత లేని నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంవల్ల ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉందని బండి సంజయ్ అన్నారు.

రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం