Karimnagar News : భారమైన పేగు బంధం, కొడుకులు చూడడంలేదని ఠాణా మెట్లెక్కిన తల్లులు
Karimnagar News : తిట్టినా, కొట్టినా భరించారు, కనికరిస్తారని ఎదురుచూశారు. కానీ కన్న కొడుకుల్లో మార్పు రాలేదు. గుప్పెడు మెతుకులు పెట్టే నాథుడి లేక రోడ్డున పడ్డారు. చివరకు చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు తల్లులు తమను ఆదుకోవాలని ఠాణా మెట్లెక్కారు.
Karimnagar News : అమ్మకు కష్టం వచ్చింది. కన్న కొడుకులు కనికరం లేకుండా ప్రవర్తించారు. బుక్కెడు బువ్వ పెట్టకుండా ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంతో ఇద్దరు తల్లులు రోడ్డున పడ్డారు. తల దాచుకునే తావులేక, ఆదుకునే వారు కానరాక ఠాణా మెట్లెక్కి న్యాయం చేయండని వేడుకున్నారు. పేగు బంధం భారంగా భావిస్తూ కనికరం లేకుండా ప్రవర్తించిన కొడుకుల తీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించింది. రెండు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నలుగురు కొడుకులు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన వేముల నరసవ్వకు నలుగురు కొడుకులు. నవమాసాలు మోసి పేగు తెంచుకుని పుట్టిన నలుగురిని పెంచి పెద్ద చేసింది. పెళ్లిలు చేసి ఉన్న కాస్త ఆస్తి అందరికీ సమానంగా పంచి తన బాధ్యతను నెరవేర్చుకుంది. వయో భారంతో ఉన్న ఆ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు పేగు బంధం భారంగా భావించారు. అమ్మకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సింది పోయి ఆదరించడమే మానేసి ఇంట్లోకి రాకుండా వ్యవహరించారు. ఒకరు ఇలా ఉన్నారనుకుంటే...మొత్తం నలుగురు కొడుకులు అమ్మని దూరం పెట్టారు. కొడుకుల తీరుతో విసిగిపోయిన ఆ తల్లి తల్లడిల్లిపోయి ఓ చిన్న గుడిసెలో తలదాచుకుంది. రోజులు గడిచినా ఏ ఒక్క కొడుకు, కోడలు కనికరించే పరిస్థితి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. నడవడానికి సైతం సత్తువ లేని ఆ అవ్వ ఓ మహిళ సహాయంతో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన గోడు వెల్లబోసుకుంది. కొడుకులకు బుద్ది చెప్పి న్యాయం చేయాలని ఎస్ఐ చేరాలును వేడుకుంది. కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అవ్వను ఇంటికి పంపారు పోలీసులు.
జగిత్యాలలో మరో తల్లి
జగిత్యాల పట్టణం శ్రీరామ్ నగర్ లో ముగ్గురు కొడుకులు తల్లి ముల్లె రాజవ్వను ఇంట్లో నుంచి గెంటేశారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కొడుకులు, జీవనచరమాంకంలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది కాస్త మెతుకులు పెట్టకుండా బూతులు తిట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో విధిలేని పరిస్థితిలో పోలీసులను ఆశ్రయించింది. కొడుకులు శివాజీ, సుధాకర్, నవీన్, కోడళ్లులు వనజ, ప్రవళీక, మౌనిక రెండు నెలల నుంచి ఆదరించకుండా నిత్యం దూషిస్తూ కొడుతూ తిండి పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త లక్ష్మణ్ ఇటీవల ఆక్సిడెంట్స్ లో మృతి చెందగా పరిహారం కింద వచ్చిన లక్ష రూపాయలు ఇవ్వాలని ముగ్గురు కొడుకులు తిడుతూ కొడుతూ ఇంట్లోకి రాకుండా బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద కొడుకు బుద్దిమంతుడు అనుకుంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడని పోలీసుల ఎదుట తన ఆవేదన వ్యక్తం చేసింది. వృద్ధ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కొడుకులకు కౌన్సిలింగ్ నిర్వహించి న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేయాలి
కన్నవారిపట్ల కనికరం లేకుండా ప్రవర్తించే కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. ఇటీవల మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో మల్లమ్మను కొడుకులు ఇంట్లో నుంచి గెంటేయడంతో పోలీసులను ఆశ్రయించగా సీఐ సదన్ కుమార్ కొడుకులకు తగిన గుణపాఠం చెప్పారు. కన్నవారిని ఆదరించుకుంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలు చేస్తానని హెచ్చరించారని అలానే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని కొడుకులపై సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. పేరెంట్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు..
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం