ACB Raids : ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్, ఆందోళన కలిగిస్తున్న రెవెన్యూ ఉద్యోగుల అవినీతి
ACB Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి ఆగడంలేదు. గత నెలలో అంతర్గాం తహసీల్దార్ ఏసీబీకి చిక్కితే తాజాగా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పట్టుబడ్డారు. రూ.6000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ చిక్కి అరెస్టు అయ్యారు.
ACB Raids : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. నెలలో ఒకలిద్దరూ ఏసీబీకి చిక్కుతున్నారు. గత నెలలో అంతర్గాం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా తాజాగా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పట్టుపడ్డారు. రైతు నుంచి ఆరు వేలు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంను ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. రూ.6000 సీజ్ చేసి, కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
నాలా కన్వర్షన్ కు పదివేలు డిమాండ్
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన రైతు కలకుంట్ల నవీన్ రావు తనకు ఉన్న రెండు గుంటలు వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పది రోజుల అయినా డిప్యూటీ తహసీల్దార్ పట్టించుకోలేదు. పది వేల రూపాయలు ఇస్తేనే పని అవుతుందని స్పష్టం చేశాడు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా ప్రయోజనం లేకపొయింది. చివరకు ఆరు వేలు ఇస్తానని ఒప్పుకుని నవీన్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో రూ.6 వేలు డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఆగని అక్రమ దందా...
ఏసీబీ అధికారుల మెరుపు దాడులతో పలువురు ఉద్యోగులను పట్టుకున్నా, రెవెన్యూ ఉద్యోగుల అవినీతి దందా మాత్రం ఆగడం లేదు. నిబంధనల ప్రకారం పని చేయాల్సిన అధికారులు చేయి చాచి లంచంగా డబ్బులు తీసుకుంటూ అడ్డంగా బుక్ అవుతున్నారు. లచ్చం ఇవ్వడం లంచం తీసుకోవడం నేరమేనని ఏసీబీ అధికారులు పదే పదే చెబుతున్నా అధికారుల ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే గడిచిన మూడు నెలల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరుగురిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రతి నెల ఠంచన్ గా జీతం వస్తున్నా లంచానికి కక్కుర్తి పడి అడ్డంగా బుక్ కావడం వారి పాపం పండిందని జనం భావిస్తున్నారు. లంచగొండి అవినీతి అధికారులపై కఠినంగా వ్యలహరించాలని కోరుతున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం