Karimnagar Crime: విదేశీ టూర్లతో కస్టమర్లకు ఎర, ఏజెంట్ల మాయలో అప్పులపాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.600 కోట్ల మోసం-karimnagar residents suffer rs 600 crore loss in foreign tour scam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime: విదేశీ టూర్లతో కస్టమర్లకు ఎర, ఏజెంట్ల మాయలో అప్పులపాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.600 కోట్ల మోసం

Karimnagar Crime: విదేశీ టూర్లతో కస్టమర్లకు ఎర, ఏజెంట్ల మాయలో అప్పులపాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.600 కోట్ల మోసం

HT Telugu Desk HT Telugu
Jan 16, 2025 09:30 AM IST

Karimnagar Crime: క్రిప్టో కరెన్సీ...ఈ కరెన్సీ గురించి ఏ మాత్రం తెలిసినా ముందుగా చెప్పేది బిట్ కాయిన్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఎన్ని కాయిన్లు చెలామణిలో ఉన్నాయో కూడా ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వారికి తెలియదు. కేవలం బిట్ కాయిన్ ధర లక్షలకు చేరుకున్నదంటూ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు.

కరీంనగర్‌లో బిట్‌ కాయిన్‌ పెట్టుబడుల పేరుతో భారీ మోసం
కరీంనగర్‌లో బిట్‌ కాయిన్‌ పెట్టుబడుల పేరుతో భారీ మోసం

Karimnagar Crime: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు క్రిప్టో కరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టి కనీసం ఒక వంతు కూడా వెనక్కి రాబట్టుకోలేక చేతులెత్తేసిన వైనం ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో కలకలం రేపుతోంది.

600 కోట్లకు వరకు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి సహా అనేక పట్టణ ప్రాంతాల్లో సుమారు 500 నుంచి 600 కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. ఒక్క కరీంనగర్ లోనే బాధితుల సంఖ్య అడ్డగోలుగా ఉందని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. తమ పెట్టుబడులు కోల్పోయామని తెలిసి లబోదిబోమంటున్న బాధితులు ఏజెంట్లపై ఒత్తిడి పెంచుతున్న బాధితుల సంఖ్య అడ్డగోలుగా ఉండటంతో ఏజెంట్లు కూడా ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది.

నగరానికి చెందిన కొందరు ఏజెంట్లు తాజా పరిణామాలతో ఏం చేయాలో కూడా తెలియక లబోదిబోమంటున్నారు. రెండు నెలలు తిరగకముందే బోర్డు తిప్పేయడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఏజెంట్లు.. తమ పెట్టుబడుల సంగతేమిటంటూ కస్టమర్లు ఇప్పుడు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఫిర్యాదులు చేస్తే పెట్టుబడులు వస్తాయో రావో కూడా తెలియక ఇప్పుడు ఇటు ఏజెంట్లు.. అటు కస్టమర్లు త్రిశంకుస్వర్గంలో మిగిలిపోయారు.

లాభాల పేరుతో మాయాజాలం…

ఏ రంగంలోనైనా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలంటే సంస్థ యజమాని.. దాని ప్రొఫైల్ లావాదేవీలు .. ఇలా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని నమ్మదగినదే అయితేనే పెట్టుబడులు పెట్టడం సహజం. ఇప్పటి వరకు జరుగుతున్న తంతు ఇలాగే ఉండేది. అదే క్రిప్టో కరెన్సీ వరకు వచ్చేసరికి అంతా మాయాజాలమే. యజమాని ఎవరో ఎవరికి తెలియదు. అంతేనా ఏ దేశమో కూడా తెలియదు.. ఒక కాయిన్ ఒక దేశస్తుని పేరు చెబితే మరో కాయిన్ మరో దేశం పేరు చెబుతారు.

ఆయా కాయిన్ నిర్వా హకులు ముందుగా తమకు ఆదాయం సమకూరే ప్రాంతాలను గుర్తించి మార్కెట్ లో కొంత గుర్తింపు లావాదేవీల్లో ఆరితేరిన వారికి ప్రాధాన్యతనిచ్చి మచ్చిక చేసుకొని ఏజెంట్లుగా నియామకం చేసుకున్నారు. విదేశీ టూర్లు, ఖరీదైన మద్యం, సహా రకరకాల ప్రభోభాలు, ఆకర్షణీయమైన కమీషన్లు ఎరవేసి ఏజెంట్లకు హెూదాలు, గ్రేడులు కల్పించి తమకంటూ ఒక వర్గాన్ని, గ్రూపును తయారు చేసుకుంటారు. పైగా ప్రతీ రోజు సాయంత్రం జూమ్ మీటింగు ద్వారా ఇతర దేశాల నుంచి కూడా మాట్లాడిస్తూ తమ వ్యాపారం మరింత పుంజుకునేందుకు సవాలక్ష ఎత్తుగడలకు పాల్పడుతున్నారు.

ఏజెంట్లపై భరోసాతో..

చిట్ ఫండ్లో ఒక లక్ష రూపాయల చిట్ వేసినా ఆ సంస్థ గురించి నమ్మకం ఉంటేనే వేస్తాం. అలాంటిది ముక్కు మొఖం తెలియని క్రిప్టో కరెన్సీ యజమాని ఎవరో కూడా తెలియకపోయినా లక్షలాది రూపాయలు పెట్టుబడులుగా పెడుతున్నామంటే అందుకు కారణం. ఏజెంట్త మకు నమ్మదగిన వ్యక్తి కావడంతో గుడ్డిగా ఆయన వెన్నంటి తాము పెట్టుబడులు పెట్టడంతో పాటు తమతో పాటు ఇతరులను కూడా ప్రొత్సహించడం ద్వారా తమకూ కమీషన్లు వస్తాయనే దురాశే ఈ క్రిప్టో కరెన్సీ దోపిడిని మూడు పూలు .. ఆరు కాయలుగా సాగేలా చేస్తోంది.

తాము నష్టపోతామా .. లాభపడుతామా అన్నది ఖచ్చితంగా తెలియకపోయినా తమకు తెలిసిన వారి ద్వారా పెట్టుబడులు పెట్టిస్తే తమ పెట్టుబడి నుంచి కొంత కమీషన్ల రూపంలో తిరిగి వస్తుందనే దూరాలోచనతోనే పెట్టుబడులు పెట్టిన వారు మరికొందరిని ఇందులో చేర్పిస్తూ వస్తున్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్ మాయాజాలంలో ఇటు ఏజెంట్లు.. అటు కస్టమర్లు చిక్కకుని నేడు విలవిలలాడుతున్నారు.

వ్యాపారులే అధికం..

కొంతకాలంగా వ్యాపార రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారందరూ ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు. పెట్టినా వ్యాపార రంగం ఏ మాత్రం ఆశాజనకంగా లేని నేపథ్యంలోనే వ్యాపారులు ఈ క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఒకవైపు వ్యాపారులు, మరోవైపు ఉద్యోగులు కూడా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందనే ఏకైక సూచన మేరకే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని సమాచారం. చాలా వరకు బాధితులు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారని కూడా చెబుతున్నారు.

చేసిన అప్పులు తీరే మార్గం లేక బాధితులు మరో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ లోని గంజ్ ప్రాంతానికి చెందిన వ్యాపారులు 50 కోట్ల రూపాయలకు పైగా క్రిప్టో కరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టి మోసపోయారని చెబుతున్నారు. మోసపోయిన బాధితులు బయటకు చెప్పుకుంటే పరువుపోతుందని లోలోన కుమిలిపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి కట్టడి చేసే చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner