Karimnagar Politics : రసవత్తరంగా కరీంనగర్ రాజకీయాలు, అసెంబ్లీ బరిలో బండి సంజయ్!
Karimnagar Politics : కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇన్నాళ్లు ఎంపీగా పోటీ చేస్తానన్న బండి సంజయ్ అధిష్టానం ఆదేశిస్తే... అసెంబ్లీ బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Karimnagar Politics : దేశం కోసం, ధర్మం కోసం తనకు పార్టీ ఏ పని అప్పగించినా తాను సిద్ధమేనని కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను బరిలో నిల్చోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కరీంనగర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు కొత్త జయపాల్ రెడ్డి పేరు ఖరారు అవుతుందనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ నుంచి బరిలో ఎవ్వరుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
బండి సంజయ్ టార్గెట్ గా
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై యుద్ధం మొదలుపెట్టారు. తాడోపేడో తేల్చుకుందామన్న రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారించడం, ఆరోపణలు ప్రత్యారోపణలతో రాష్ట్రంలో బండి సంజయ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారేవి. ఇదంతా గతం, కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా బండిని ప్రక్కన పెట్టి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షునిగా భాధ్యతలు అప్పగించడంతో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్న జిల్లాలోని బీజేపీ సీనియర్ నాయకులు సంజయ్ ను బాధ్యతల నుంచి తప్పించడంతో బాహాటంగానే సంబరాలు చేసుకున్నారు. జమిలి ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే వచ్చిన ప్రచారాల నేపథ్యంలో జమిలి ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీచేస్తానని బండి చెప్పడంతో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవ్వరు అనే అంశంపై పార్టీ మల్లగుల్లాలు పడింది.
గంగుల, బండి కుమ్ముక్కు?
గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయరని గంగుల బండి కుమ్ముక్కు అయ్యారని ఇద్దరి మధ్య ఉన్న విభేధాలు బాహాటంగా ప్రదర్శించడానికే తప్ప అసలు కథ వేరేగా ఉందని నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభమైంది. ఇద్దరు నేతలు కలుసుకుని ఒకరు ఎంపీగా, ఒకరు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించాలని ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు బండి సంజయ్. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే వ్యక్తినే కానీ పదవుల కోసం పాకులాడే మనిషిని కాదని, తనపై దుష్ప్రచారం చేసే వారు తనతో నేరుగా కొట్లాడాలని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడిన వ్యక్తినే తప్ప కుమ్ముక్కు రాజకీయాలు తనకు తెలియవని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ముగ్గురి మధ్య రసవత్తర రాజకీయం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ముస్లిం ఓట్లు నియోజకవర్గంలో సుమారు ముప్పై ఆరు వేల పైచీలుకు ఉండడంతో ఎంఐఎం నేతలతో గంగుల కమలాకర్ చర్చలు జరపడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీగా ఉంటానన్న మరుక్షణమే తాను చర్చలు జరపడం వారితో కలిసిన ఫొటోలు మీడియాకు విడుదల చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ముక్కోణపు పోటీలో బలాబలాలను ఎవరికి వారు అంచనాలు వేస్తూ ముందుకు సాగుతున్నారు.