karimnagar Police: హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసుల అలర్ట్... విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
karimnagar Police: రంగుల కేళీ రంగోలి... హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రంగుల్లో మునిగితేలే యువతరం జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని కరీంనగర్, రామగుండం పోలీస్ కమీషనర్ లు హెచ్చరించారు.

karimnagar Police: రంగుల పండుగ హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునే పనిలో జనం నిమగ్నమయ్యారు. ప్రతిసారి హోళీ సంబరాల్లో అపశృతులు దొర్లుతుండడంతో ఈసారి హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
హోలీ నేపథ్యంలో రద్దీ ప్రదేశాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. కరీంనగర్ లో సిపి గౌస్ ఆలం పలు ప్రాంతాల్లో రాత్రి పూట పర్యటించి హోళీ వేడుకల పట్ల అనుసరించాల్సిన వ్యూహంపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. అటు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో సైతం అక్కడి సిపి అంబర్ కిషోర్ ఝా అలెర్ట్ ప్రకటించారు.
రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి.గితే సైతం హోలీ సంబరాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. సురక్షితంగా బాధ్యతతో హోళీ పండుగ జరుపుకోవాలని నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సహజ రంగులే వాడాలి...
హోళీ సందర్బంగా చర్మానికి పర్యావరణానికి హానికరం కాని సహజ రంగులను ఉపయోగించాలని పోలీస్ అధికారులు సూచించారు. నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడవద్దని ఆదేశించారు.
ఇతరులపై బలవంతంగా రంగులు వేయకుండా, పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణించబడుతుందని ప్రకటించారు.
మద్యం సేవించి వాహనం నడిపవద్దని, ట్రిపుల్ రైడింగ్, మైనర్ లు వాహనాలు నడపడం నేరమని హెచ్చరించారు. మైనర్ లు వాహనాలు నడిపితే పేరెంట్స్ తోపాటు వాహన యాజమాననిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజాస్థలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధమని ప్రకటించారు.
హోళీ అనంతరం జలాశయాల్లో స్నానాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ లో స్విమ్మింగ్ నిషేదించినట్లు పోలీసులు తెలిపారు. మర్యాదగా వ్యవహరించి, ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు.
వాడవాడన కామ దహనం...
హోళీ కి ముందు రాత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కామ దహనం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో ఆవుపేడతో తయారు చేసిన పిడకలతో రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు కామదహనం చేశారు. ప్రతి గ్రామంలో వాడలో కర్రలు పాత వస్తువులతో కామ దాహనం నిర్వహించారు.
కరీంనగర్ లో నిర్వహించిన కామ దహనం వేడుకల్లో మాజీ మేయర్ బిజేపి నాయకులు వై.సునీల్ రావు పాల్గొన్నారు. కామ దహనం సందర్భంగా కరీంనగర్ లో సి పి గౌస్ ఆలం పర్యటించి పలు ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. హోళీ సందర్బంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
(రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం