Karimnagar Police: తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు...31 రాత్రిపై పోలీసుల స్పెషల్ ఫోకస్..-karimnagar police on high alert for drunk drivers on new years eve ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Police: తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు...31 రాత్రిపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

Karimnagar Police: తాగి రోడ్డెక్కితే అంతే సంగతులు...31 రాత్రిపై పోలీసుల స్పెషల్ ఫోకస్..

HT Telugu Desk HT Telugu
Dec 31, 2024 06:46 AM IST

Karimnagar Police: కరీంనగర్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు శృతి మించకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలు విధించడంతోపాటు మద్యం సేవించి రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌ రివ్యూలో సీపీ అభిషేక్ మహంతి
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌ రివ్యూలో సీపీ అభిషేక్ మహంతి

Karimnagar Police: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 31న పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. 31న సాయంత్రం నుంచి మరుసటి రోజు జనవరి 1న ఉదయం వరకు నిరంతరాయంగా వాహనాల తనిఖీ తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు. కరీంనగర్ లో తీగల వంతెన, లోయర్ మానేర్ డామ్ కట్టపై నిషేధాజ్ఞలు విధించారు.

yearly horoscope entry point

31న సాయంత్రం 6 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఎవరికీ అనుమతి లేదని సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని ప్రకటించారు. భారీ శబ్దాలతో కాల్చే టపాసులు, డీజే సౌండ్ లను నిషేదించామని తెలిపారు. బైక్ సైలెన్సర్లను మార్చి శబ్దకాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడిపినా, అనుమతులు లేకుండా జనసముహమైన ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు నూతన చట్టాలకనుగుణంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇంటికే పరిమితమై వేడుకలు జరుపుకోవాలని కోరారు.

ఆర్థిక నేరాలు.. సైబర్ క్రైమ్ 61శాతం..

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 2024 లో క్రైమ్ రేట్ పెరిగింది. 61 శాతం ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్ కేసులు ఉంటే మిగతా 39 శాతం ఇతర కేసులు ఉన్నాయని సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. 2024 పోలీస్ వార్షిక నివేదికను విడుదల చేసి మీడియాతో మాట్లాడిన సిపి, ఆర్థిక నేరాలకు సంబంధించి మొత్తం 726 కేసులు నమోదు కాగ అందులో అత్యధికంగా సైబర్ నేరాలు 46%, భూమికి సంబంధించిన నేరాలు 15%, నగదుకు సంబంధించి 8%, చిట్ ఫండ్ కు సంబంధించి 7%, జాబ్ ఫ్రాడ్ సంబంధించి 5% ఉన్నాయని తెలిపారు.

కమిషనరేట్ లో 2023లో డయల్ 100 ద్వారా 43,815 ఫిర్యాదులు రాగా, 2024లో డయల్ 100 ద్వారా 46,191 ఫిర్యాదులు అందాయని చెప్పారు. 2024లో 18,625 ఫిర్యాదులు అందగా అందులో ఫైనాన్స్ కు సంబందించినవి 23% కాగా, బాడీలి అఫెన్సెస్ (శారీరక నేరాలు) 11%, రోడ్ యాక్సిడెంట్స్ 5% ఉన్నాయన్నారు. 7027 ఎఫ్ఐఆర్ నమోదు కాగా 5180 కేసుల విచారణ పూర్తి అయిందని తెలిపారు.

తగ్గిన కేసులు...

రాయిటింగ్ (అల్లర్లు/ దొమ్మి) కేసులు 44% తగ్గితే, రాబరీ, డెకాయిటి (దోపిడి) కేసులు 38%,, హత్యలు 33%, చైన్ స్నాచింగ్ కేసులు 30%, ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 9.36% తగ్గాయని సిపి తెలిపారు. 2023 సంవత్సరంలో ఆర్ధిక సైబర్ నేరాల్లో 114 కేసుల్లో బాధితులు కోల్పోయిన 1.74 కోట్ల రూపాయలు ఫుట్ ఆన్ హొల్డ్ లో ఉంచగా, 2024 సంవత్సరంలో ఆర్ధిక సైబర్ నేరాల్లో 233 కేసుల్లో బాధితులు కోల్పోయిన 9.87 కోట్ల రూపాయలు పుట్ ఆన్ హొల్డ్ లో ఉంచగలిగామని, 2024 సంవత్సరానికి గాను 2.57 కోట్ల రూపాయలు బాధితులకు అప్పగించుటకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందామని తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమి కాజేసిన ఘటనల్లో 113 కేసులు నమోదైతే 179 మంది అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించనున్నారు.

చిట్ ఫండ్ చీటింగ్...

కమిషనరేట్ వ్యాప్తంగా 2024 సంవత్సరంలో చిట్ ఫండ్ మోసాలకు సంబంధించి 50 కేసులు నమోదు కాగ 9 మంది చిట్ ఫండ్ డైరక్టర్స్ తో సహా 16 మందిని అరెస్ట్ చేశామని సిపి తెలిపారు. జాబ్ ఫ్రాడ్ మోసాలకు సంబంధించి 33 కేసులు నమోదు కాగా 27 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 610 కేసులు నమోదు చేసి 1198 మందిని అరెస్టు చేసి 797 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎన్.డి.పి.ఎస్. (మాదకద్రవ్యాల /గంజాయి) కేసులు 39 నమోదు కాగా 85 మంది ఆరెస్టు చేసి 128 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

భారీగా పిడిఎస్. బియ్యం పట్టివేత...

కమిషనరేట్ వ్యాప్తంగా 2023లో పి.డి.ఎస్. బియ్యం అక్రమ రవాణా చేసిన 10 కేసులు నమోదు కాగా 22 మంది అరెస్ట్ చేసి 06 వాహనాలను స్వాధీనం చేసుకుని 553 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా, 2024లో 99 కేసులు నమోదు కాగా 189 మంది అరెస్ట్ చేసి 96 వాహనాలు స్వాధీనం చేసుకుని 4289 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశామని సిపి చెప్పారు.

2025 సంవత్సరంలో రెగ్యులర్ పోలీసింగ్ తో పాటు ముఖ్యంగా కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. విసిబుల్ పోలీసింగ్ కి మరింత ప్రాముఖ్యత పెంచుతామని, అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం తోపాటు ఆర్థిక నేరాలు సైబర్ మోసాలు అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్ధిక నేరాలకు పాల్పడే వారిపై దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలతో మంచి సత్సంబంధాలను కలిగి ఉండి భాదితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner