Karimnagar Cultivation: జోరు వానతో పెరుగుతున్న వరిసాగు విస్తీర్ణం, అన్నదాతల్లో ఆనందం-karimnagar paddy area growing with heavy rains farmers are happy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Cultivation: జోరు వానతో పెరుగుతున్న వరిసాగు విస్తీర్ణం, అన్నదాతల్లో ఆనందం

Karimnagar Cultivation: జోరు వానతో పెరుగుతున్న వరిసాగు విస్తీర్ణం, అన్నదాతల్లో ఆనందం

HT Telugu Desk HT Telugu

Karimnagar Cultivation: వర్షం కురిసింది... అన్నదాతల్లో ఆనందం వెల్లువిరిసింది. సాగుబడి పనులు జోరందుకున్నాయి. మొన్నటి వరకు నత్తనడకన సాగిన వరి నాట్లు, విస్తారంగా కురిసిన వర్షాలతో వరినాట్లు వేసే పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు.

కరీంనగర్‌లో పెరిగిన వరిసాగు, రైతుల్లో ఆనందం

Karimnagar Cultivation: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటల సాగువిస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షపాతం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా కరీంనగర్ జిల్లాలో పైర్లసాగు 24 శాతానికి, పెద్దపల్లి 30శాతం, జగి త్యాల 25, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30 శాతానికి చేరింది.

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనద్రోణి ప్రభావంతో ఇంకా వర్షసూచన ఉండటంతో పంటలసాగు విస్తీర్ణం సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది. శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ లోకి వరదనీరు వచ్చిచేరుతుండటం ఆశాజనకంగా మారింది. ప్రస్తుతం భూగర్భ జలాల ఆధారంగా పంటలను సాగుచేస్తుండగా వర్షాలు మరింతగా పెరిగితే ఆయకట్టు రైతులకు భరోసా కలుగుతుంది.

సన్నరకం వరికి ప్రాధాన్యం

ఈ ఖరీఫ్ సీజన్ లో 8.45 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తారని అంచనా. ప్రస్తుతం వర్షాలను ఆసరాగా చేసుకుని పెద్దఎత్తున వరినాట్లు వేస్తున్నారు. నిరుటితో పోలిస్తే దొడ్డుగింజ వరి రకాల సాగు ఈ వానాకాలంలో తగ్గనుంది. రాష్ట్రప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామనటంతో సన్నగింజ వరిరకాల సాగు గణనీయంగా పెరుగుతోంది.

ప్రస్తుతం స్వల్ప కాలిక రకాలతో వరి నార్లకు ఈ నెలాఖరు వరకు, అతి స్వల్ప కాలిక రకాలతో ఆగస్టు మొదటి వారం వరకు వరినాట్లకు ఆగస్టు నెలాఖరు వరకు సమయం ఉంది. వర్షాలు అనుకూలిస్తే వరిసాగు గత ఏదాది మాదిరిగా 9.65 లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశముంది. ఇప్పటివరకు 1.55 లక్షల ఎకరాల్లో పత్తిని విత్తుకోగా ఈ నెలాఖరు వరకు రెండు లక్షల ఎకరాలకు సాగు పెరగనుంది.

పలు రకాల పంటల సాగుకు మరో పక్షం రోజుల వరకు అవకాశం ఉండటంతో పసుపు పంట 35 వేల ఎకరాలు, మక్క 55 వేలు, కంది 11 వేల ఎకరాల్లో సాగులోకి రానుంది. దాదాపుగా 30 వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో అయిల్ ఫామ్ మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పంటలసాగు క్రమంగా పెరుగుతున్న తరుణంలో రైతులందరికీ పంటరుణ మాఫీ నిధుల విడుదల, నూతన పంటరుణాల మంజూరు, పెట్టుబడి సాయం, వ్యవసాయ యాంత్రీకరణకు నిధుల విడుదల, రైతుబీమా పథకం కొనసాగింపు, రసాయన ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నట్లయితే వానాకాలం పంటలసాగులో రైతులకు మరింత మేలు చేకూరనుంది.

ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 3.20 లక్షల ఎకరాల్లో వరిసాగు

ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకు సాగు చేసిన పంటల వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మూడు లక్షల 31 వేల 252 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 75 వేల ఎకరాల్లో వరి సాగయింది.‌ అలాగే పెద్దపల్లి జిల్లాలో రెండు లక్షల 83 వేల 8760ఎకరాల్లో వరి చేయాల్సి ఉండగా 90 వేల ఎకరాల్లో, జగిత్యాల జిల్లాలో 374645 ఎకరాల్లో వరి సాగు చేయాల్సిన ఉండగా 80వేల ఎకరాల్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 243292 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా 75 వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈనెఖరు వరకు మరో లక్ష ఎకరాల్లో వరి సాగు కానున్నదని అధికారుల అంచనా.‌‌

(రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)