Bandi Sanjay Vs Ponnam Prabhakar : బండి జ్యోతిష్యం చదివారా? పొన్నం అహంకారి-కౌంటర్ కి రీకౌంటర్
Bandi Sanjay Vs Ponnam Prabhakar : పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని, కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. పొన్నం కౌంటర్ కు బండి సంజయ్ రీకౌంటర్ ఇచ్చారు.
Bandi Sanjay Vs Ponnam Prabhakar : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, ఎమ్మెల్యేలను కొనేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైనా జరగొచ్చన్నారు. కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ నిఘా పెట్టాలన్నారు. కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అంటూ విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే, రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తేనే ఎక్కువగా నిధులు వస్తాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని సెటైర్లు వేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఆ నింద బీజేపీ మీద వేసేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని విమర్శించారు. అందుకే ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను బొంద పెట్టాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన బీజేపీకి లేదని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్ భారీగా డబ్బులు ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.
బండి వ్యాఖ్యలపై పొన్నం కౌంటర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేటీఆర్ కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము బీజేపీ, బీఆర్ఎస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా లేదని, కాంగ్రెస్ ప్రభుత్వాని కూల్చే సాహసం ఎవరూ చేయలేరన్నారు. బీఆర్ఎస్ త్వరలోనే రెండుగా చీలిపోతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని బండి సంజయ్ వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒక పార్టీకి సంబంధించిన సమాచారం మరో పార్టీకి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తే బండి సంజయ్ కు ఎందుకు? ఆయనేమైనా జ్యోతిష్యం చదివారా? అంటు ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
పొన్నం వ్యాఖ్యలపై బండి రీకౌంటర్
హనుమకొండ కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న బండి సంజయ్... మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని పొన్నం విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బండి స్పందిస్తూ... కేటీఆర్ కు ఉన్న అహంకారమే పొన్నం ప్రభాకర్ లోనూ కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఏది మాట్లాడితే పొన్నం ప్రభాకర్ అదే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి పరిస్థితి వచ్చిందో, పొన్నం ప్రభాకర్ వల్ల కాంగ్రెస్ అదే గతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారం ప్రదర్శిస్తే ప్రజలే బుద్ది చెప్తారన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లకు పైగా గెలువబోతోందని జోస్యం చెప్పారు.