TG Mlc Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పేరు ఖరారు-karimnagar mlc election tptf candidate ashok kumar name confirmed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పేరు ఖరారు

TG Mlc Elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పేరు ఖరారు

HT Telugu Desk HT Telugu

TG Mlc Elections : ఫిబ్రవరి 27న జరిగే కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై.అశోక్ కుమార్ పోటీ చేయనున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన అశోక్ కుమార్ ను టీపీటీఎఫ్ రంగంలోకి దింపింది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పేరు ఖరారు

TG Mlc Elections : వచ్చే నెల 27వ తేదీన జరిగే కరీంనగర్- మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా వై. అశోక్ కుమార్ ను ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు దశబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పని చేసిన అశోక్ కుమార్ 2024లో పదవీ విరమణ పొందారు.

'హక్కులకై కలబడు- బాధ్యతలకు నిలబడు' అన్న నినాదంతో పనిచేస్తూ, స్వతంత్రంగానూ ఐక్య ఉద్యమ వేదికల ద్వారా విద్యారంగ అభివృద్ధికి,

ఉపాధ్యాయుల, అధ్యాపకుల సంక్షేమానికి టీపీటీఎఫ్ కృషి చేస్తుందని ఆ సంస్థ నాయకులు అంటున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ముందు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ భావజాలానికి పురుడుపోసిన సంస్థ టీపీటీఎఫ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అశోక్ కుమార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించామన్నారు. అలాగే వరంగల్, ఖమ్మం , నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరును టీపీటీఎఫ్ ఖరారు చేసింది.

అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే నాయకత్వం

రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపక వర్గాల సమస్యలు అనేకం ఏళ్ల తరబడి పేరుకుపోయి ఉన్నాయని, అయినా వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టీపీటీఎఫ్ నాయకులు ఆరోపిస్తు్న్నారు. ఉపాధ్యాయ ఉద్యమంలో అనైక్యత కారణంగా సమస్యల పరిష్కారం కావడంలేదని అంటున్నారు. సమస్యల సాధనకు సంఘటిత ఉద్యమాలే ఏకైక పరిష్కార మార్గమని టీపీఎఫ్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంలో ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై అవగాహన కలిగి ఉన్న సంఘటిత ఉద్యమాలు నిర్మాణంలో అనుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్సీగా గెలువాల్సిన అవసరం ఉందని టీపీటీఎఫ్ భావిస్తుంది. అశోక్ కుమార్ లాంటి నాయకులు ఉపాధ్యాయులందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల పై పోరాడగలరని టీపీటీఎఫ్ నమ్ముతుంది.

మొదటి నుంచి ఉద్యమాలలో

అభ్యర్థి వై.అశోక్ కుమార్ విద్యార్థి దశనుండే విద్యారంగం అభివృద్ధి కోసం పని చేసి, టీచర్ గా ఏపీటీఎఫ్ లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యకర్తగా పనిచేసి, గత రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు.

ఉమ్మడి మెదక్ పశ్చిమ జిల్లా తెలంగాణ జేఏసీ ఛైర్మన్ గా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని టీపీటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చాక కూడా టీజేఏసీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉండి ప్రజావ్యతిరేక, పలు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన నిలిచారన్నారు. ఇలాంటి గళం చట్ట సభలలో ఉంటే ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజల గొంతుకగా నిలబడే అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాత్ర కలిసొస్తుందా

తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలకంగా వ్యవరించిన అశోక్ కుమార్ కు, పార్టీలకు అతీతంగా ఇతర పార్టీల నుంచి, ఇతరుల నుంచి మద్దతు ఉంటుందని ఆయన మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.