Mid Manair Canal : కరీంనగర్ జిల్లాలో కెనాల్ కు గండిm, నీట మునిగిన పంట పొలాలు-ఇళ్లలోకి చేరిన వరద నీరు-karimnagar mid manair sub canal wall collapsed water flood to farm fields houses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mid Manair Canal : కరీంనగర్ జిల్లాలో కెనాల్ కు గండిM, నీట మునిగిన పంట పొలాలు-ఇళ్లలోకి చేరిన వరద నీరు

Mid Manair Canal : కరీంనగర్ జిల్లాలో కెనాల్ కు గండిm, నీట మునిగిన పంట పొలాలు-ఇళ్లలోకి చేరిన వరద నీరు

HT Telugu Desk HT Telugu

Mid Manair Canal : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి వద్ద సాగునీటి కాలువకు గండి పడింది. గ్రామంలోకి వరద పోటెత్తింది. పలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పంట పొలాలు నీట మునిగాయి. గ్రామస్తులు ఆందోళన దిగగా, కాలువకు నీటిని నిలిపివేసి మరమ్మతు పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

కరీంనగర్ జిల్లాలో కెనాల్ కు గండిm, నీట మునిగిన పంట పొలాలు-ఇళ్లలోకి చేరిన వరద నీరు

Mid Manair Canal : కరీంనగర్ జిల్లాలో నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతం అయింది. ఈనెల ఒకటి నుంచి సాగునీటిని విడుదల చేస్తున్న అధికారులు కాలువలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. మిడ్ మానేర్ నుంచి రైట్ సైడ్ కెనాల్ కు 250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆ నీరు తోటపల్లి రిజర్వాయర్ నుంచి మానకొండూర్ హుస్నాబాద్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. తిమ్మాపూర్ మండలం పీచుపల్లి నుంచి మానకొండూరు మండలం చెంజర్ల వరకు ఉన్న ఉపకాలువకు నీటిని విడుదల చేశారు. మెట్టప్రాంతమైన చివరి ఆయకట్టు చెంజర్లకు సాగునీరు అందాలంటే కాస్త ఎక్కువ నీరు వదిలారు. దీంతో మన్నెంపల్లి వద్ద తెల్లవారుజామున వరద ఉధృతికి గండి పడింది. వెంటనే గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించగా కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.

ఎస్సీ కాలనీలో వరద నీరు

కాలువకు గండి పడంతో వరద నీరు మన్నెంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీని ముంచెత్తింది. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. పండగ పూట పిండివంటలు చేసుకునేందుకు సిద్ధమైన ఎస్సీ కాలనీ వాసులు కాలువ నీరు ఇళ్లలోకి చేరడంతో సామాగ్రి తడిసి ముద్దయింది. పంట పొలాలు నీటమునగాయి. కాలువ గండితో పంట నష్టంతో పాటు ఇంట్లో సామాను తడిసి పండుగ పుట ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఎస్సీ కాలనీ వాసులతోపాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

నాలుగోసారి గండి

మన్నెంపల్లి వద్ద కాలువకు గండి పడడం ఇది నాలుగోసారి. గతంలో గండి పడ్డప్పుడు గ్రామస్తుల ఆందోళనకు దిగి ఇక ముందు గండి పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా మట్టి పోసి వదిలేశారు. కాలువ పక్కన గుట్ట ఉండడంతో వరద నీరు పోయేందుకు అక్కడ డిపి ఏర్పాటు చేశారు. కాలువ లో వరద ఉధృతి ఎక్కువగా ఉండడం...మట్టితో పోసిన కట్ట కావడంతో గండి పడుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కాంక్రీట్ తో కట్టను నిర్మించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం సీసీ తో కట్ట నిర్మించిన తర్వాతే కాలువకు నీటిని విడుదల చేయాలని మాజీ సర్పంచ్ అంజయ్య తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు.

గండి పై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కాలువ గండిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు. గ్రామస్తులకు ఫోన్ చేసి కాలువ గండితో ప్రజలు పడ్డ ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకుని సహాయక చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గండి పడ్డ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. కాలువ గండితో వరద నీరు పోటెత్తి ఇళ్ళలోకి నీళ్ళు చేరిన బాధితులను పరామర్శించి దైర్యం చేప్పారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి నష్టపోయిన వారికి తగిన పరిహారం చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కి ఫోన్ చేసి కాలువ గండితో గ్రామస్తులు రైతుల ఇబ్బందులు పడకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి సంజయ్ కోరారు. కాలువకు నీటిని నిలిపి వేసిన ఇరిగేషన్ అధికారులు మరమ్మత్తు పనుల్లో నిమగ్నమయ్యారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం