Karimnagar News : కరీంనగర్ లో బీఆర్ఎస్ కు షాక్-కారు దిగి కాషాయదళంలో చేరిక మేయర్ సునీల్ రావు
Karimnagar News : కరీంనగర్ లో బీఆర్ఎస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ లో కొందరి నేతల వైఖరి నచ్చక బీజేపీలో చేరుతున్నట్లు సునీల్ రావు ప్రకటించారు.
Karimnagar News : కరీంనగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. నగర పాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపించి మేయర్ తో పాటు ఇద్దరు కార్పొరేటర్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్ లో కొందరి నేతల వైఖరి నచ్చక, అభివృద్ధిని కాంక్షిస్తూ బండి సంజయ్ నేతృత్వంలో నగరాభివృద్ధి జరుగుతుందని భావించి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కారు దిగి కాషాయ దళంలో చేరిన మేయర్ పై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. అవినీతి నుంచి తప్పించుకోవడానికే బీజేపీలో చేరినట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగరవేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కల నెరవేరింది. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెరదించేలా మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతో మరో నాలుగు రోజులు బీజేపీకి చెందిన మేయర్ గా సునీల్ రావు కొనసాగనున్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా సునీల్ రావు మేయర్ హోదాలో కార్పొరేషన్ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని ఎగరవేయన్నారు. తద్వారా బీజేపీకి చెందిన మేయర్ జెండా ఆవిష్కరణతో కార్పొరేషన్ పై కాషాయానికి చెందిన నేత జెండా ఎగరవేయడం కార్పొరేషన్ తమ వశం అయిందనే భావనలో బీజేపీ ఉంది. మేయర్ తో పాటు పలువురు కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరుతున్నట్లు ముందుగా ప్రచారం జరిగింది.
అయితే కేటిఆర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి మేయర్ వెంట కార్పొరేటర్లు బీజేపీలో చేరకుండా కట్టడి చేయడంతో ప్రస్తుతం మేయర్ తో పాటు కార్పొరేటర్ లు శ్రీదేవిచంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు మాత్రమే బీజేపీలో చేరారు. 20 మంది కార్పొరేటర్లకు చేరుతున్నట్లు బండి సంజయ్ ముందు సునీల్ రావు ప్రస్తావించగా అవినీతి, భూకబ్జాల కేసులు ఉన్న వారిని పార్టీలో చేర్చుకోబోమని బండి సంజయ్ ప్రకటించారు.
వేడెక్కిన కరీంనగర్ రాజకీయాలు
మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతో కరీంనగర్ రాజకీయాలు హీటెక్కాయి. చట్టసభలకు ఎన్నికలు జరిగిన తర్వాత ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు సర్వసాధారణమే అయినా తాజాగా కరీంనగర్ మేయర్ పార్టీ మారడం సంచలనంగా మారింది. ఈ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీలో కలకలాన్ని రేపింది.
మరోనాలుగు రోజుల్లో మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగియనున్న తరుణంలో మేయర్ సునీల్ రావు తీసుకున్న నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలగకపోయినా... బీఆర్ఎస్ వర్గాలు మాత్రం మండిపడుతున్నాయి. మేయర్ పై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ పలువురు కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అటు మేయర్ సైతం ఎమ్మెల్యేపై ఘాటుగానే స్పందించారు.
అవినీతి నుంచి తప్పించుకోవడానికే పార్టీ మారిండు-ఎమ్మెల్యే
మేయర్ సునీల్ రావు పై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. అధికార స్వార్థంతో అవినీతి నుంచి తప్పించుకోవడానికే పార్టీ మారారని ఆరోపించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం సునీల్ రావుకు అలవాటని విమర్శించారు. పార్టీ మారే వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని గతంలో అధిష్టానానికి చెప్పానని తెలిపారు.
సునీల్ రావును మేయర్ ను చేసి తప్పుచేశాం...ప్రజలను క్షమించుమని కోరుతున్నామని గంగుల కమలాకర్ అన్నారు. సునీల్ రావు పార్టీని వీడడం దరిద్ర్యం పోయిందని అనుకుంటున్నామని చెప్పారు. మేయర్ ఆరోపించినట్లు మానేర్ రివర్ ఫ్రంట్ లో అవినీతి జరిగితే ఎలాంటి విచారణ అయిన జరిపించుకోవచ్చని తెలిపారు. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీలో చేరిన సునీల్ రావు అవినీతిని బయటపెడుతామని స్పష్టం చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే ఆయన బండారం బయట పెడతామని గంగుల కమలాకర్ హెచ్చరించారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్ గంగుల కమలాకర్- మేయర్
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై మేయర్ సునీల్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గంగుల కమలాకర్ అని ఆరోపించారు. నగరంలో కుంభకోణాలు అక్రమాల్లో ఎమ్మెల్యే గంగుల పాత్ర ఉందని విమర్శించారు. తాను అవినీతికి పాల్పడితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని... నీవు సిద్దమా? అని బహిరంగ సవాల్ విసిరారు. టెండర్లు, కమిషన్ల వరకే ఎమ్మెల్యేకు అవసరమని, కమీషన్ లు తప్ప, పనులు పట్టవని ఆరోపించారు. బ్యాంకాక్, దుబాయ్, పట్టాయ్ వెళ్ళేది గంగుల అని, శ్రీలంకకు వెళ్ళి పత్తాలు అడిన చరిత్ర గంగులదేనని ఆరోపించారు.
స్మార్ట్ సిటీ గురించి మాట్లాడుతున్న గంగుల జాగ్రత్త అని హెచ్చరించారు. బండి సంజయ్ కృషి ఫలితంగా స్మార్ట్ సిటీకి రూ.930 కోట్లు వచ్చాయని తెలిపారు. చాలా మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దంగా ఉన్నా, బ్రతిమాలి దావత్ ఇచ్చి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో తనకు మేయర్ అవకాశం ఇచ్చింది కేసీఆర్, వినోద్ కుమార్ మాత్రమేనని, గంగుల కమలాకర్ మేయర్ పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. బండి సంజయ్ ద్వారానే నగరం అభివృద్ధి చెందుతుందని భావించి బీజేపీలో చేరానని సునీల్ రావు స్పష్టం చేశారు.
బావకు షాక్ ఇచ్చిన మేయర్
బావ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ నిత్యం వెన్నంటి ఉండే సునీల్ రావుపై వినోద్ కుమార్ గంపెడాశలు పెట్టుకున్నారు. తాను స్వయంగా పార్టీలో చేర్పించి మేయర్ పదవిని అలంకరించేలా చేయడం ద్వారా తనకు అంతగా పట్టులేని కరీంనగర్ లో సునీల్ రావును బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ఆశించారు. తన సామాజిక వర్గం కావడం.. సమీప బంధువు కావడంతో కరీంనగర్ లో విశ్వసనీయ నేతగా ఉంటారని అంచనా వేశారు. అయితే మేధావి వర్గానికి చెందిన వినోద్ కుమార్ ఊహకు కూడా అందని రాజకీయాలు కరీంనగర్ లో చోటు చేసుకోవడంతో ఆయన కంగుతినక తప్పలేదని ఇప్పుడు సన్నిహితులు వాపోతున్నారు.
2015 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ సునీల్ రావు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ద్వారా గులాబీ గూటికి చేరారు. ఐదేళ్లపాటు బీఆర్ ఎస్ పార్టీలో క్రియాశీల నేతగా ఎదిగారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని ఆశిస్తూ రంగంలోకి దిగారు. గంగుల కమలాకర్ వ్యతిరేకించినా కూడా వినోద్ కుమార్ పట్టుబట్టి సునీల్ రావు పేరును ఖరారు చేయించారు. ఈ విషయాన్ని వినోద్ పలు సందర్భాల్లో బయట పెట్టారు. అలాంటి మేయర్ తీరా లోక్ సభ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని తెలిసి షాక్ కు గురయ్యారు.
కొంతకాలం పాటు దూరంగా ఉంచే ప్రయత్నం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోవడం.. పార్టీ కూడా అధికారంలో లేకపోవడంతో వినోద్ కుమార్ సైలెంట్ గా ఉండిపోయారు. మున్సిపల్ పదవీకాలం ముగిసే వరకు ఉంటారని భావించగా.. తీరా చివరి నిమిషంలో స్మార్ట్ సిటీ ఘనత బండి సంజయ్ దేనని మరోసారి బహిరంగసభలో కీర్తిస్తూ మేయర్ చేసిన ప్రసంగాన్ని విని వినోద్ కుమార్ నివ్వెరపోకతప్పలేదు. మేయర్ పదవిని కట్టబెడితే బావ కళ్లల్లో ఆనందం చూపిస్తారని భావిస్తే తీరా ఇక్కడమో భిన్నంగా చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రిపోర్టింగ్ : కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.