Fake Cotton Seeds : ఉల్లిగడ్డల మాటున నకిలీ పత్తి విత్తనాల రవాణా, ఇద్దరి అరెస్ట్
Fake Cotton Seeds : రామగుండం పోలీసులు నకిలీ పత్తి విత్తనాలు గుట్టురట్టుచేశారు. గుంటూరులో కొనుగోలు చేసి కర్ణాటక మీదుగా కరీంనగర్ ఇక్కడి నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టుచేశారు.
Fake Cotton Seeds : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిషేధిత నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టయ్యింది. ఇద్దరిని టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకుని భారీ మొత్తంలో నిషేధిత బిటి-3 నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. పట్టుబడ్డ పత్తి విత్తనాలు 5.5 క్వింటాళ్లు కాగా వాటి విలువ రూ.16 లక్షల 50 వేల వరకు ఉంటుందని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు మంచిర్యాల జిల్లా లక్ష్సెట్ పేట మండలం కొత్తూరుకు చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ కం ఓనర్ సొల్లు పెద్దయ్య అలియాస్ సురేష్, క్లీనర్ హరికుమార్ గా గుర్తించారు. వారి నుంచి 5.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలతోపాటు లక్షా 80 వేల నగదు, మూడు మొబైల్ ఫోన్ లు, ఐటర్ డీసీఎం వ్యాన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
ఉల్లిగడ్డల మాటున కర్నాటక నుంచి మహారాష్ట్రకు తరలింపు
మార్కెట్ లో పత్తి విత్తనాలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని కుట్రపన్ని అడ్డంగా బుక్ అయ్యారు సురేష్, హరికుమార్. తక్కువ ధరకు గుంటూరుకు చెందిన సుబ్బారావు వద్ద కొనుగోలు చేసి కర్నాటక నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఉల్లిగడ్డల మాటున నకిలీ పత్తి విత్తనాలను తరలించడం మొదలు పెట్టారు. వ్యాన్ లో అడుగుబాగాన నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు పెట్టి పైన ఉల్లిగడ్డల బ్యాగ్ లు వేసి తరలిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్సై లచ్చన్న, సిబ్బందితో మంచిర్యాల జోన్ లోని చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీ చేయగా ఉల్లిగడ్డ బస్తాల కింద రూ.16,50,000 విలువైన 5.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు దొరికినట్లు సీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం పట్టుబడ్డ ఇద్దరితోపాటు పత్తి విత్తనాలు విక్రయించిన సుబ్బారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్తి విత్తనాల రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులను సిబ్బందిని సీపీ అభినందించి రివార్డ్ లు అందజేశారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ – సీపీ శ్రీనివాస్
రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు చేపడుతామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. నిషేధిత నకిలీ కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. నకిలీ, కల్తీ విత్తనాలను సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం తీసుకున్న నిర్ణయాలకు, ఆదేశాలకు అనుగుణంగా తనిఖీలు ముమ్మరం చేశామని తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా నకిలీ కల్తీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులు ఎవరివద్దపడితే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయకుండా గుర్తింపు పొందిన డీలర్లు, విత్తనాలు ఎరువుల షాపుల్లోనే కొనుగోలు చేయాలని అందుకు సంబందించి రసీదుతో పాటు విత్తనాల ప్యాకెట్(బ్యాగ్) ను భద్రంగా దాచి పెట్టుకోవాలని సూచించారు. విత్తనాలు మొలకెత్తకపోయినా, పంట దిగుబడి రాకపోయినా వినియోగదారుల మండలిలో ఫిర్యాదు చేసి తగిన పరిహారం పొందవచ్చని తెలిపారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి