Karimnagar Cyber Crime : అమ్మ, నాన్న సారీ నేను వెళ్లిపోతున్నా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Karimnagar Cyber Crime : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కరీంనగర్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. అధిక ప్రొఫిట్ ఆశ చూపి పెట్టుబడి పెట్టించిన సైబర్ నేరగాళ్లు చివరికి అకౌంట్ ఖాళీ చేశారు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Karimnagar Cyber Crime : సైబర్ నేరానికి కరీంనగర్ జిల్లాలో బీటెక్ విద్యార్థి బలయ్యాడు. బంగారు భవిష్యత్ ఉన్న యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి తనువు చాలించాడు. తల్లిదండ్రులకు తెలిస్తే..ఏమంటారనే భయంతో ఈ అఘాత్యాయానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు.. కళ్ల ముందే చనిపోవడంతో పేరెంట్స్ తట్టుకోలేక కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషి వర్ధన్ డిప్లమా పూర్తి చేశాడు. పై చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నారు. చదువులో మంచి ప్రతిభను చూపేవాడు వర్ధన్. ఇటీవల రిషి వర్ధన్ కు టెలిగ్రామ్ లో వచ్చిన మెసేజ్ ను ఓపెన్ చేశాడు. మా కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు డబుల్ వస్తాయని ఆశ చూపారు. మొదటగా 5000, 6000, 25000, 65000 వరకు పెట్టాడు. తరువాత 1,50,000 ప్రాఫిట్ చూపించారు. మరిన్ని డబ్బులు పెడితే.. ఇంకా డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పారు. ఇది నమ్మి మరింత పెట్టుబడి పెట్టాడు.
మోసగాళ్లు 2 లక్షల 50 వేలు కడితే మీ డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చని చెప్పారు. అయితే కొద్ది నిమిషాల్లో అకౌంట్లో అప్పటికే డబ్బులు పూర్తిగా అయిపోయాయి. ప్రాఫిట్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వలేదు. చాలా సార్లు ప్రయత్నం చేశాడు. ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించారు. ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు మొత్తం లాగేసుకున్నారు. అయన అకౌంట్ నిల్ గా మారిపోయింది. రిషి వర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మానసికంగా ఇబ్బంది పడ్డారు. డబ్బుల పోయిన విషయం ఇంట్లో తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూసైడ్ నోట్ రాసి
ఆత్మహత్యకు ముందు రిషి వర్ధన్ ఓ సుసైడ్ నోట్ రాశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు కిటికీలో నుంచి చూసి అన్న ఉరివేసుకున్నాడని కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి హాస్పటల్ కు తరలించే లోపే మృతి అతడు మృతిచెందాడు. కన్న కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. "అమ్మ, నాన్న నేను మోసపోయాను నా చావుకు ఎవరు కారణం కాదు" అని సూసైడ్ నోట్లో రాసి చనిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు రోదనలు మిన్నంటాయి.
సైబర్ నేరాలపై అప్రమత్తం
సైబర్ మోసాలు రోజుకో చోట జరుగుతూనే ఉన్నాయి. ప్రజలను చైతన్య చేసేందుకు ఎంత ప్రయత్నించినా మోసాలు ఆగడం లేదు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో క్రైమ్ రేట్ లో 61 శాతం ఆర్థిక పరమైన సైబర్ మోసాలే ఉన్నాయని పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. మొబైల్ లో వచ్చే మెసేజ్ లకు, కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్ లకు రెస్పాండ్ కావద్దని పోలీసులు కోరుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు తమ మోసం చేసే తీరును మార్చుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే తప్ప మోసాల నుంచి బయటపడే పరిస్థితి లేదన్నారు పోలీస్ అధికారులు. ప్రస్తుతం సైబర్ మోసంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పట్ల పోలీసులు విచారం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం