Bandi Sanjay : గల్లీ నుంచి దిల్లీ స్థాయికి- బండి సంజయ్ రాజకీయ నేపథ్యం ఇలా!
Bandi Sanjay : కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు మోదీ కేబినెట్ లో చోటు లభించింది. ఇవాళ సాయంత్రం బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన రాజకీయ నేపథ్యం ఇలా సాగింది.
Bandi Sanjay : కేంద్ర మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు అవకాశం లభించడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. సంజయ్ ఇంటా సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీతో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 20 ఏళ్ల తర్వాత కరీంనగర్ కు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి బండి సంజయ్ ఎదగడంతో కన్నతల్లి శకుంతల భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద బాష్పాలు రాల్చి సంతోషం వ్యక్తం చేశారు. తోడు నీడగా కష్టసుఖాల్లో భాగస్వామి అయిన సంజయ్ సతీమణి అపర్ణ మోదీ నేతృత్వంలో ఏదో ఒకరోజు దేశ్ కీ నేత అవుతారని భావించానని తెలిపారు. సంజయ్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనిషిగా ప్రజాసేవకు అంకితమైన సంజయ్ దేశం కోసం ధర్మం కోసం పోరాడుతూ కేంద్రమంత్రి కావడం గర్వపడుతున్నామన్నారు బండి సంజయ్ ఫ్యామిలీ మెంబెర్స్.
బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్
బండి సంజయ్ కుమార్ 1971 జులై 11 కరీంనగర్ లో బండి శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు. మున్నూరుకాపు కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ అపర్ణను వివాహం చేసుకున్నారు. సంజయ్ సతీమణి ప్రస్తుతం ఎస్.బి.ఐ లో ఉద్యోగిని. సంజయ్ అపర్ణ దంపతులకు ఇద్దరు కొడుకులు సాయి భగీరథ్, సాయి సుముఖ్. బాల్యం నుంచే సంజయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో స్వయం సేవకుడిగా పనిచేశారు. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్ గా కొనసాగారు. బీజేపీ జాతీయ కార్యాలయం, దిల్లీలో ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జ్ గా భారతీయ జనతా యువ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, వరుసగా రెండు పర్యాయాలు నగర బీజేపీ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఎల్.కె అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇన్ ఛార్జ్ గా పనిచేశారు.
కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత తొలిసారిగా 48వ డివిజన్ నుంచి 2005లో తొలిసారి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి 2010లో అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు. 2014, 2018, 2023 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2016లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండో స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిల్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 89508 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు. 2019 అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబెర్ గా టొబాకో బోర్డు మెంబెర్ గా, మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబెర్ గా, 2020 ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబెర్ గా నియామకమై ఇంకా కొనసాగుతున్నారు.
2020 మార్చి 11 నుంచి 2023 జులై 3 వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు బండి సంజయ్. 2023 జులై 8న జాతీయ కార్యవర్గ సభ్యులుగా, 29 జులై 2023న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియామకమయ్యారు. 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 89016 ఓట్లు సాధించి 3163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 5,85,116 ఓట్లు సాధించి, 2,25,209 మెజారిటీతో రెండోసారి ఎంపీగా ఘన విజయం సాధించారు. 2006 ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు 2,01,581 ఓట్లు రాగా, 2014లో వినోద్ కుమార్ కు 2,05,007 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ఇవే అత్యధిక ఓట్లు కాగా.. తాజా ఫలితాలతో బండి సంజయ్ కుమార్ ఆ రికార్డులను బద్దలు కొట్టి, కరీంనగర్ చరిత్రలో మరో కొత్త రికార్డు నెలకొల్పారు.
అంబరాన్ని అంటిన సంబరాలు
గల్లీ నుంచి దిల్లీ స్థాయికి బండి సంజయ్ అంచెలంచెలుగా ఎదగడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. పార్టీ శ్రేణులతోపాటు అభిమానులు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బండి సంజయ్ ఇంటికి చేరి కుటుంబ సభ్యులను అభినందించారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు కరీంనగర్ లో సంజయ్ ఎంపీ కార్యాలయం వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. డిజే సౌండ్స్ డప్పు చప్పుల్లతో యూత్ నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
మారుమూల పల్లెలకు బీజేపీని తీసుకెళ్లిన సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరించడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటం వృధా కాలేదు అంటున్నారు జిల్లా ప్రజలు.
ఎంపీగా రెండు సార్లు జైల్ కు వెళ్లిన బండి సంజయ్
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లారు బండి సంజయ్. ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోదీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు.
సంజయ్ ది ఆటుపోట్ల జీవితం
బండి సంజయ్ రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం