Karimnagar : రూ. 60 వేలు లంచం తీసుకుంటా...! ఏసీబీకి చిక్కిన మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు-karimnagar agricultural market secretary caught by acb for bribe ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : రూ. 60 వేలు లంచం తీసుకుంటా...! ఏసీబీకి చిక్కిన మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు

Karimnagar : రూ. 60 వేలు లంచం తీసుకుంటా...! ఏసీబీకి చిక్కిన మార్కెట్‌ కమిటీ ఉద్యోగులు

HT Telugu Desk HT Telugu

కరీంనగర్ లో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. 60 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తంతో పాటు ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ కరివేద శ్రీనివాసరెడ్డి పట్టుబడ్డారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏసిబికి చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఏ.పురుషోత్తం పాపం పండింది. అడ్తి వ్యాపారాలను లంచం కోసం వేధించడంతో విసిగిపోయిన వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించారు. ఫ్రూట్ హోల్ సెల్ వ్యాపారుల నుంచి 60 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేరుగా లంచం డబ్బులు కార్యదర్శి పురుషోత్తం తీసుకోకుండా ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ కార్డ్ శ్రీనివాసరెడ్డి ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. లంచం డబ్బులను సీజ్ చేశారు.

రూ. లక్ష చొప్పున డిమాండ్...

వ్యవసాయం మార్కెట్ యార్డులో పండ్ల వ్యాపారులు అడ్తి వ్యాపారం చేస్తారు. అడ్తి వ్యాపారం కోసం మూడేళ్ళకోసారి లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. లైసెన్స్ గడువు ముగియడంతో మామిడి పళ్ళ సీజన్ ఆరంభం అవుతుండడంతో లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని వ్యాపారులను ఆదేశించాడు. రెన్యువల్ కోసం వ్యాపారులు సిద్దం కాగా మార్కెట్ కార్యదర్శి ఒక్కొక్క వ్యాపారి రెండు లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతా ఇచ్చుకోలమని వేడుకోగా లక్ష చెప్పిన ఇవ్వాలని హుకుం జారీ చేశాడు.

అడిగినంత డబ్బు ఇస్తేనే రెన్యువల్ చేస్తానని పేపర్లు మార్కెట్ కి రాకుండా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. దీంతో వ్యాపారులు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ను కలిసి కార్యదర్శికి ఫోన్ చేయించారు. మంత్రుల ఫోన్ తో కాస్త వెనక్కి తగ్గిన కార్యదర్శి కనీసం రూ. 60 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పండ్ల వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మకాయల పాషా ఏసీబీని ఆశ్రయించాడు. అతని నుంచి మార్కెట్ కార్యదర్శి రూ. 60 వేలు నేరుగా తీసుకోకుండా ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు శ్రీనివాస్ రెడ్డి ద్వారా స్వీకరిస్తుండగా ఏసిబి అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు.‌

ఏసీబీకి చిక్కిన మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం ఇప్పటికే 8 మంది ఫ్రూట్ వ్యాపారుల నుంచి 60 వేలు చొప్పున వసూలు చేసినట్లు పండ్ల వ్యాపారులు తెలిపారు. మొత్తం 20 మంది హోల్ సెల్ ఫ్రూట్ వ్యాపారులు ఉండగా లైసెన్స్ రెన్యువల్ కోసం ముందుగా 2 లక్షల చొప్పున డిమాండ్ చేసి చివరకు 60 వేలకు ఒప్పందం చేసుకున్నాడని వ్యాపారులు వెల్లడించారు. డబ్బులు ఇవ్వకుంటే లైసెన్స్ రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడని తెలిపారు. కార్యదర్శి వేధింపులు భరించలేక ఏసీబీకి పట్టించామని పండ్ల వ్యాపారులు తెలిపారు.

రిపోర్టింగ్:కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.