IAS Praful Desai : తప్పుడు వార్తలపై కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఆవేదన - ఎలాంటి మెడికల్ టెస్టుకైనా సిద్ధమని వెల్లడి
Karimnagar Additional Collector Praful Desai : అంగవైకల్యంపై తనపై మీడియోలో వస్తున్న పలు వార్తలపై ఐఏఎస్ ఫ్రపూల్ దేశాయ్ స్పందించారు. ఏలాంటి మెడికల్ టెస్ట్ కైనా సిద్దమన్నారు.
Karimnagar Additional Collector Praful Desai : అంగవైకల్యం ఉందని ఫేక్ సర్టిఫికెట్ తో ఐఏఎస్ సాధించాడని మీడియాలో వస్తున్న వార్తల పట్ల కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ఫ్రపూల్ దేశాయ్ స్పందించారు. తప్పుడు ప్రచారం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన వైకల్యంపై ఏ మెడికల్ బోర్డు పరీక్షకైనా సిద్ధమని, తప్పుడు సమాచారంతో ఐఏఎస్ సాధించినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలపై సవివరంగా వివరించారు.
మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ అంగ వైకల్యానికి సంబంధించిన నకిలీ పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ఫ్రపూల్ దేశాయ్ ఎదుర్కొంటున్నారు.
నకిలీ అంగవైకల్యం పత్రాలతో ఐఏఎస్ పొందారని ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్రపుల్ దేశాయ్ సైకిల్ తొక్కుతున్న ఫొటో, గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోతోపాటు హైదరాబాద్‌లో స్నేహితులతో కలిసి టెన్నిస్ ఆడుతున్న ఫోటలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంగవైకల్యం ఉంటే అవన్నీ ఎలా చేయగలుగుతారంటూ నెటిజన్లు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. యూపీఎస్‌సీ పరీక్షల్లో అంగవైకల్యం కోటాను ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
వికలాంగుల కోటాలో ఐఏఎస్..!
కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన ఫ్రపుల్ దేశాయ్ రైతు కుటుంబంలో జన్మించారు. అయిదేళ్ల వయస్సులో ఎడమ కాలికి పోలియో సోకింది. అయితే తన ఎడమ కాలు పూర్తిగా పక్షవాతానికి గురి కాలేదు. కానీ కొంత వైకల్యం మాత్రం ఉంది. కర్ణాటకలోని నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా కొన్నాళ్లు విధులు నిర్వహించిన ఫ్రపూల్ దేశాయ్ యూపీఎస్సీ పరీక్ష రెండు సార్లు రాసి 2019 లో 532వ ర్యాంక్ పొంది వికలాంగుల కోటాలో ఐఏఎస్ సాధించారు.
2018లో యుపిఎస్సీ పరీక్షకు హాజరై ఇంటర్వ్యూకి వెళ్ళానని ప్రఫూల్ దేశాయ్ తెలిపారు. ఇంటర్వూ అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్ లో మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించగా వైకల్యం ఉందని ధృవీకరించిందని తెలిపారు. కానీ తాను 2018లో ఐఏఎస్ సాధించలేక పోయానని తెలిపారు.
మరోసారి 2019 యుపిఎస్సీ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూకు హాజరుకాగ మళ్ళీ డిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ క్షుణ్ణంగా పరీక్షించి వైకల్యం ఉన్న వ్యక్తని ధృవీకరించిందని చెప్పారు. ఆ నివేదిక DOPT మరియు UPSCతో భాగస్వామ్యం చేయబడిందని తెలిపారు.
సైక్లింగ్, ట్రెక్కింగ్, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని, ఆ పోటోలు శిక్షణ కార్యక్రమంలో భాగంగా బ్యాచ్‌మేట్స్, ఫ్రెండ్స్‌తో తీసుకున్నవని తెలిపారు. వైకల్యం కారణంతో తాను అస్సలు నడవలేనని కాదు.. కానీ స్నేహితులతో కొంచెం ఆడుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
తరచు కాకుండా.. ఎప్పుడన్నా తన స్నేహితులతో బ్యాడ్మింటన్ ఆడతానన్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై ఆయన సవివరంగా వివరించారు. శిక్షణలో భాగంగా పర్వాతారోహణ చేశానన్నారు. గుర్రపు స్వారీ మాత్రం.. శిక్షకుడు పర్యవేక్షణలోనే చేశానని చెప్పారు. అయితే సోషల్ మీడియాలోని తనపై నెటిజన్లు చేస్తున్న కామెంట్ల పట్ల ఫ్రపుల్ దేశాయ్ అసహనం, ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా జీవించడం తప్పా…?
వైకల్యం ఉన్నంత మాత్రాన శారీరకంగా ఛాలెంజ్డ్ వ్యక్తిగా ఉండటం తప్పా అని ప్రఫూల్ దేశాయ్ ప్రశ్నించారు. నా శారీరక పరిమితులను పెంచడం కోసం ఇతరుల వలె సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించానని అది తప్పుపట్టడం సమంజసం కాదన్నారు.
తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్న నెటిజన్ అందరికీ నా అభ్యర్థన ఏమిటంటే వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఆరోపణలే నిజమైనట్లు ప్రచారం చేయవద్దని ఏలాంటి మెడికల్ బోర్డు పరీక్షనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తనకు 45 శాతం అంగవైకల్యం ఉందని సరిఫికేట్ జారీ చేసిందని పేర్కొన్నారు.