Kaleswaram Motors Safe : కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లు సురక్షితమే...-kaleswaram project lift motors in safe condition whici drown in floods ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kaleswaram Project Lift Motors In Safe Condition Whici Drown In Floods

Kaleswaram Motors Safe : కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లు సురక్షితమే...

HT Telugu Desk HT Telugu
Jul 31, 2022 09:15 AM IST

గోదావరి ఉగ్ర రూపంతో వరద ప్రవాహం పోటెత్తి నీట మునిగిన కాళేశ్వరం ప్రాజక్టు పంపులు సురక్షితంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. గోదావరి వరద తగ్గు ముఖం పట్టడంతో పంప్‌ హౌస్‌లలో చేరుకున్న నీటిని తొలగించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

గోదావరి వరదల్లో మునిగిన కాళేశ్వరం మోటర్లు సురక్షితమే….
గోదావరి వరదల్లో మునిగిన కాళేశ్వరం మోటర్లు సురక్షితమే….

చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా గోదావరి వరద ప్రవాహం పోటెత్తడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నీట మునిగాయి. వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు పంపుల్లోకి గోదావరి ప్రవాహం పోటెత్తడంతో వాటి భద్రతపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో నీటి అవసరాలను తీర్చేలా నిర్మించిన ప్రాజెక్టులోకి స్వల్ప కాలంలోనే వరద ప్రవాహం పోటెత్తడంపై విపక్షాల నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

వరద కారణంగా నీట మునిగిన అన్నారం, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పునరుద్ధరించే పనులు వేగంగా సాగుతున్నాయి. ఇరిగేషన్‌ అధికారులతో పాటు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రణాళిక ప్రకారం పనులు పనిచేస్తున్నారు. పంప్‌హౌస్‌లో చేరిన నీటిని మొదట తొలగించి, ఆపై లోపల పేరుకున్న బురదను ఒక్కో ఫ్లోర్‌ వారీగా తొలగించనున్నారు. ఒక్కో ఫ్లోర్‌లో ఏ మాత్రం తేమ లేకుండా చేసిన తర్వాతే మరో ఫ్లోర్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మోటర్లలో చేరిన నీరు మొత్తం ఆవిరయ్యే వరకు వేడి చేసి, మోటర్‌ స్టార్టింగ్‌ ప్యానల్స్‌ తదితర ఎలక్ట్రిక్‌ పరికరాల పరిస్థితిని పరీక్షించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఆ మోటర్లు సేఫ్‌....!

గోదావరి వరదలతో అన్నారం పంప్‌హౌస్‌లో చేరిన నీరు, బురదను ఇప్పటికే పూర్తిగా తొలగించి, లోపల ఏమాత్రం తేమ లేకుండా చేశారు. పంప్‌హౌస్‌ నిర్మాణంతో పాటు అందులో ఉన్న 12 మోటర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ మోటర్లు ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తాయని అధికారులు తెలిపారు. రెండు మోటర్లకు ప్రాథమికంగా సాంకేతిక పరీక్షలు కూడా నిర్వహించారు. వాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మిగిలిన మోటర్లకు ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ఆపై తనిఖీలు చేయనున్నారు. ఆగస్టు 10వ తేదీ నుంచి మోటర్లను పూర్తిగా విప్పి తనిఖీలు నిర్వహిస్తారు. ఆగష్టు చివరి నాటికి రెండు మోటర్లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సెప్టెంబర్‌ చివరి నాటికి పంప్‌హౌస్‌ మొత్తాన్ని సిద్ధం చేసేందుకు ఇంజినీర్లు శ్రమిస్తున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో వరద నీటిని తోడే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు రోజుల్లో నీటిని తొలగించే పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. నీరు పూర్తిగా తోడిన తర్వాత పంప్‌హౌస్‌లో ఉన్న మొత్తం 17 మోటర్లు, ఇతర ఎలక్ట్రిక్‌ పరికరాల పరిస్థితి తెలియనుంది.

IPL_Entry_Point

టాపిక్