మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థికమంత్రిగా పనిచేశారు.
జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్ ను విచారణకు రావాలని కమిషన్ సూచించింది. నోటీసులపై 15 రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని కోరింది.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ మేడిగడ్డ కుంగిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తుంది.
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కారణంగా... దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ ఎకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది.
ఇప్పటి వరకూ 7 సార్లు కమిషన్ గడువు పొడిగించారు. మరో నెల కమిషన్ గడువు పొడిగిస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరుకు కమిషన్ గడువు పూర్తికావాల్సి ఉంది. మే 21న లేదా 22న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రచారం జరిగింది.
కమిషన్ విచారణలో సీనియర్ ఇంజినీర్లు, అధికారులు చాలా మంది మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో నిర్ణయాలు జరిగాయని చెప్పారని సమాచారం. ఆయన ఆదేశాల మేరకే పలు నిర్ణయాలను అమలు చేశామని చెప్పడంతో... వీటిపై కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనే తాజాగా కమిషన్ వీరి ముగ్గురికీ నోటీసులు ఇచ్చింది.
జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్ రావు, జూన్ 9న ఈటల విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే వీరు విచారణకు హాజరవుతారా? కోర్టులను ఆశ్రయిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. గతంలో ఒకసారి కమిషన్ నోటీసులు ఇవ్వగా...కేసీఆర్ కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
సంబంధిత కథనం