Warangal : స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక వస్తే.. తప్పకుండా బరిలో ఉంటా: కడియం శ్రీహరి-kadiyam srihari key comments on the mlas disqualification petition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal : స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక వస్తే.. తప్పకుండా బరిలో ఉంటా: కడియం శ్రీహరి

Warangal : స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక వస్తే.. తప్పకుండా బరిలో ఉంటా: కడియం శ్రీహరి

Basani Shiva Kumar HT Telugu
Published Feb 09, 2025 01:47 PM IST

Warangal : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని.. కారు పార్టీ నేతలు ఫైట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.

కడియం శ్రీహరి
కడియం శ్రీహరి

ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్‌పై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు పరిధిలో ఉందని.. ఈనెల 10వ తేదిన తీర్పు రాబోతుందని చెప్పారు. కోర్టు తీర్పును తప్పకుండా పాటిస్తామని.. అందులో వెనక్కి పోయేదిలేదన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు.

ఆ ఘనత బీఆర్ఎస్‌దే..

'బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు చేస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే. అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు సుద్దపూసల్లాగా మాట్లాడుతున్నారు. ఫిరాయింపుల మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు. గులాబీ పార్టీ చేస్తే సంసారం.. వేరే పార్టీ చేస్తే వ్యవభిచారమా?' అని కడియం శ్రీహరి ప్రశ్నించారు.

కేటీఆర్ సంతోషపడుతున్నారు..

'డిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేటీఆర్ సంతోషపడుతున్నారు. అక్కడ ఆప్ ఓడిపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్. లిక్కర్ స్కాంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. దీనికి కారణం బీఆర్ఎస్‌తో స్నేహం చెయ్యడమే. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేది. కేజ్రీవాల్ అతిగా ఊహించుకుని ఒంటరిగా వెళ్లడంతో ఓటమి చవి చూశారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీకి అవకాశం ఉండేది కాదు' అని కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.

సిద్ధంగా ఉండండి..

'రాజ్యాంగం నిర్దేశించిన చట్టం, సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున.. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యం. నా తోటి బీఆర్ఎస్ పార్టీ సైనికులారా.. త్వరలో ఉప ఎన్నికలలో పోరాడటానికి మనం సిద్ధంగా ఉందాం' అని కేటీఆర్ ఇటీవల ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యేలకు నోటీసులు..

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇటీవల అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీకి నోటీసులు పంపించారు.

అప్పుడు ఇలానే చేశారా..

అయితే.. కేసీఆర్‌ కూడా ఆనాడు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.. వాళ్లను అప్పుడు డిస్‌క్వాలిఫై చేశారా.. అని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. న్యాయ నిపుణులతో చర్చించి.. తగు నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

Whats_app_banner