Vande Bharat: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 6వ తేదీన 'కాచిగూడ-యశ్వంత్‌పుర్' వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది.
కాచిగూడ స్టేషన్ నుంచి నంద్యాల జిల్లా డోన్ మీదుగా యశ్వంత్‌పుర్‌కు ఈ రైలు నడుస్తుంది. ఆగష్టు 6వ తేదీన 'వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు'ను ప్రారంభించడానికి దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజనల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రయల్‌రన్‌లో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6.30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10.30 గంటలకు కాచిగూడకు చేరుకుంది. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌లో నిలిపి ఉంచారు. ఆగష్టు 6వ తేదీ నుంచి రైలును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వందేభారత్ రైలు ప్రారంభోత్సవాన్ని వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీంతో పాటు అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేసిన మల్కాజిగిరి, మలక్‌పేట, ఉప్పుగూడ, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూల్‌లో అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలు సికింద్రబాద్-విశాఖపట్నం మధ్య గత జనవరిలో ప్రారంభమైంది. ఆ తర్వాత తిరుపతికి మరో రైలును ప్రారంభించారు. ఈ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. వేగంగా గమ్య స్థానాలకు చేరుకనే వీలుండటంతో రైళ్లకు ఆదరణ లభిస్తోంది. కాచిగూడ- యశ్వంతపూర్ మధ్య ప్రవేశపెడుతున్న రైలుతో ఈ మార్గంలో ప్రయాణించే వారు వేగంగా తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.