పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ హైకమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు పరిచయం ఉందని, ఆయన జ్యోతి పాకిస్తాన్ పర్యటనకు సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ట్రావెల్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి, పాకిస్థాన్ కు భారతదేశ సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అయితే జ్యోతి మల్హోత్రా భారతదేశంలోని చాలా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ తాను తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఆమె రెండేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా...సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చక్కర్లు కొట్టింది. కేంద్ర మంత్రులకు అతి సమీపంలో వీడియోలు తీస్తూ... వందే భారత్ లో వీడియోలు తీసింది.
బీజేపీ ఎంపీలు, అప్పటి గవర్నర్ తమిళిసై హాజరైన ప్రభుత్వ సమావేశాల్లో పాల్గొని, కీలక సమాచారం సేకరించినట్లు అనుమానిస్తున్నారు.
హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా హైదరాబాద్‌లోనూ హల్ చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె హడావుడి చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అప్పటి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్ జ్యోతి వీడియోలు తీస్తూ హల్‌చల్ చేశారు. అయితే హైదరాబాద్ లో ఆమె ఎవరినైనా కలిశారా? ఎక్కడెక్కడికి వెళ్లారు. ఏ ప్రాంతాల్లో వీడియోలు తీశారు? అనే కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు చెందిన పలువురికి భారత దేశ సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసి, దేశద్రోహం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్ ను అనేకసార్లు, చైనాను ఒకసారి సందర్శించారని పోలీసులు గుర్తించారు. ఆమె విలాసవంతమైన ప్రయాణాలు, ఆదాయాన్ని మించి ఉన్నాయన్నారు. ఇండో-పాక్ ఉద్రిక్తతల సమయంలో పీఐఓలను ఆమె సంప్రదించి పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రాకు కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో సంబంధాలున్న పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసి యూట్యూబ్ లో పోస్టు చేసినట్లు సమాచారం. ఈ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు ఆమె చేరవేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.