బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు-justice pc ghosh commission issues notices to kcr and harish rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

బిగ్ బ్రేకింగ్.. కేసీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌ తోపాటు హరీష్‌ రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు ఇచ్చింది జస్టిస్‌ ఘోష్ కమిషన్‌. 15 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు అక్రమంగా లాభాలు చేకూర్చారని కేసీఆర్‌పై ఆరోపణలు ఉన్నాయి.

కేసీఆర్‌కు నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్‌కు కూడా నోటీసులు ఇచ్చారు. జూన్ 5వ తేదీ లోగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీష్ రావు. అలాగే ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.

అవినీతి.. నిర్మాణంలో లోపాలు..

జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయ విచారణ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, నిర్మాణ లోపాలు, పర్యావరణ నష్టం వంటి ఆరోపణలపై ఈ కమిషన్ విచారణ జరుపుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కాంట్రాక్టర్లకు అక్రమంగా లాభాలు చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.

భారీగా పెరిగిన అంచనా వ్యయం..

ప్రాజెక్టులో పలు నిర్మాణ లోపాలు ఉన్నాయని, వరదల సమయంలో పంప్ హౌస్‌లు మునిగిపోవడానికి ఇదే కారణమనే విమర్శలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల గోదావరి నదిపై తీవ్ర ప్రభావం పడిందని, పర్యావరణానికి నష్టం వాటిల్లిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిందని, దీనికి కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు డిజైన్‌లో పలు మార్పులు చేశారని, ఈ మార్పుల వల్లనే వరదల సమయంలో పంప్ హౌస్‌లు మునిగిపోయాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ ప్రాజెక్టు లక్ష్యం..

కాళేశ్వరం.. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన ఒక బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు. నీటిపారుదల, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. భూపాలపల్లి జిల్లాలో దీన్ని నిర్మించారు. మొత్తం 20 రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీటిని నిల్వచేసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.

తాజా అంచనా వ్యయం.. రూ.1.47 లక్షల కోట్లు..

45 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు తాగునీరు, పారిశ్రామిక ,అవసరాలు సమీప గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి దీని నిర్మాణాన్ని చేపట్టారు. 22 పంప్ హౌస్‌లు నిర్మించారు. సుమారు 1,832 కిలోమీటర్లు (1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 203 కి.మీ నీటి సొరంగాలు) తవ్వారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు సుమారు 5,900 మెగావాట్లు విద్యుత్ అవసరం అని అంచనా. మొదట్లో రూ.80,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం ఇది రూ.1.47 లక్షల కోట్లకు మించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత కథనం