MLC Kavitha : లిక్కర్ కేసులో మళ్లీ నిరాశే..! ఎమ్మెల్సీ క‌విత క‌స్ట‌డీ గడువు పొడిగింపు-judicial custody of brs leader kavitha extended till july 25 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha : లిక్కర్ కేసులో మళ్లీ నిరాశే..! ఎమ్మెల్సీ క‌విత క‌స్ట‌డీ గడువు పొడిగింపు

MLC Kavitha : లిక్కర్ కేసులో మళ్లీ నిరాశే..! ఎమ్మెల్సీ క‌విత క‌స్ట‌డీ గడువు పొడిగింపు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 03, 2024 01:51 PM IST

Delhi Excise scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే ఎదురైంది. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫొటో)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (ఫైల్ ఫొటో)

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.

గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు తేదీతో ముగియడంతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా… కస్టడి గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జులై 25వ తేదీ వరకు కవిత తీహార్ జైలులోనే ఉండనున్నారు.

బెయిల్ పిటిషన్ కొట్టివేత…

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవలే ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.

సీబీఐ అవినీతి కేసు, ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున న్యాయవాదనలను తిరస్కరించిన హైకోర్టు.. జులై ఒకటో తేదీన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. సీబీఐ, ఈడీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవిస్తూ బెయిల్‌ను ఇవ్వలేమని చెప్పింది. హైకోర్టు బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఢిల్లీ ఎక్సైజ్ కేసులో 50 మంది నిందితుల్లో ఆమె ఒక్కరే మహిళ అని, చట్టం మహిళలకు అందిస్తున్న హక్కులను పరిశీలించాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని బెయిల్ పిటిషన్లను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి.

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనను తోసిపుచ్చిన దర్యాప్తు సంస్థలు, ఈ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించింది కవితేనని వాదించాయి. చురుకైన రాజకీయ నాయకురాలిగా, శాసనమండలి సభ్యురాలిగా ఉన్న ఆమె నిస్సహాయ మహిళలతో సమానం కాదన్నారు. సాక్షులను ప్రభావితం చేసేంత శక్తివంతురాలు అని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. కవిత ఎక్సైజ్ కుంభకోణానికి సహ కుట్రదారు, లబ్దిదారు అని, నేరం ద్వారా వచ్చిన ఆదాయం నేరుగా ఆమెకే వెళ్తోందని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు.

కవిత ఇతరులతో కుమ్మక్కై రూ.100 కోట్ల ముడుపులు చెల్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని, ఆ తర్వాత తన ప్రాక్సీ ద్వారా మెసర్స్ ఇండో స్పిరిట్స్ ద్వారా రూ.192.8 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఇలాంటి చర్యల ద్వారా కవిత రూ.292.8 కోట్ల మేర నేరాలకు (పీవోసీ) సంబంధించిన వివిధ ప్రక్రియలు, కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని'దర్యాప్తు సంస్థ తన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది.

మనీలాండరింగ్ నేరంతో ఆమెను సంబంధం ఉన్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న ఢిల్లీ న్యాయస్థానం… కవిత బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దాదాపు మూడు నెలలు గడిచిపోయింది.

WhatsApp channel