జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత-jubilee hills mla maganti gopinath passes away ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

జూబ్లీహిల్స్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ (62) మృతి చెందారు. జూన్ 5వ తేదీన గుండెపోటు సమస్యతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

మాగంటి రాజకీయ నేపథ్యం…

మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలో పలు బాధ్యతలను నిర్వర్తించారు. టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

కేసీఆర్ దిగ్భ్రాంతి:

పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణానికి చింతిస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.

తనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మాగంటి గోపినాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. గోపినాథ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు… మాగంటి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.