Praja sangrama yatra sabha : చేసింది చాలు - గుడ్ బై కేసీఆర్ : జేపీ నడ్డా-jp nadda says good bye to kcr government in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /   Jp Nadda Says Good Bye To Kcr Government In Telangana

Praja sangrama yatra sabha : చేసింది చాలు - గుడ్ బై కేసీఆర్ : జేపీ నడ్డా

HT Telugu Desk HT Telugu
Dec 15, 2022 06:54 PM IST

Praja sangrama yatra sabha : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదించే శక్తి కేవలం బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ కి గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరు ఒక్కటయ్యారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ వేదికా బీజేపీ నేతలు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినదించారు.

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా, బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా, బండి సంజయ్

Praja sangrama yatra sabha : తెలంగాణలో కేసీఆర్ కి గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణను 3.29 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని .. చేసింది చాలు.. ఇక సెలవు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణను ధనిక రాష్ట్రమని పదే పదే చెబుతుంటారని.. కానీ అది వాస్తవం కాదన్నారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆర్థికంగా దివాలా స్థితికి తీసుకొచ్చిన కేసీఆర్, జీవం లేని రాష్ట్రంగా మార్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు నడ్డా. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరై ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండ గట్టు ఆంజనేస్వామికి ప్రార్థిస్తున్నానని... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే సమయం వచ్చిందని జోష్యం చెప్పారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ వాగ్దానాలను ఉద్దేశించి తెలుగులో సామెతను నడ్డా ప్రస్తావించారు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసింది అన్నట్టుగా కేసీఆర్ సర్కార్ పనితీరు ఉందని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

“టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ రానున్న రోజుల్లో వీఆర్ఎస్ తీసుకుంటుంది. దుబ్బాక, హుజూరాబాద్ లో గెలిచిన తీరులోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని అప్పట్లో వాగ్దానం చేసిన కేసీఆర్ కి ఇప్పుడు మాత్రం కూతురు, కొడుకు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చేతల్లో మాత్రం కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు. ఈ సభకు హాజరయ్యేందుకు వస్తోన్న నన్ను కూడా అడ్డుకోవాలని ప్రయత్నించారు. ఇది ప్రజాస్వామ్యమా ?

"అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం నంబర్ వన్ గా మారింది. ధరణి పోర్టల్ ని ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వాడుకుంటున్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులకి రుణ మాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతి హామీని గాలికి వదిలేశారు. కేసీఆర్ ని గద్దె దించే శక్తి కేవలం బీజేపీకే ఉంది. అవినీతి, కుటుంబ పాలన, దోపిడీ, దౌర్జన్య పాలనకు వ్యతిరేకంగా ఉన్న వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. కేసీఆర్ పై పోరాటంలో బీజేపీతో కలిసి నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం" అని జేపీ నడ్డా అన్నారు.

మోదీ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని పేర్కొన్న నడ్డా.. తెలంగాణలో 4996 కిలోమీటర్ల మేర హైవేలు నిర్మించామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటున్నామని పునరుద్ఘాటించారు. సుదీర్ఘ కాలంగా పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి అభినందనలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర మున్ముందు కొనసాగుతుందని... ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి వద్దకు చేరుతుందని నడ్డా స్పష్టం చేశారు.

ఏపీ, తెలంగాణ సీఎంలు ఒక్కటయ్యారు : బండి సంజయ్

కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టేందుకే తాను పాద యాత్ర చేపట్టానని బండి సంజయ్ పేర్కొన్నారు. భావోద్వేగంతో మాట్లాడిన సంజయ్.. 8 సంవత్సరాలు ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ని ప్రజా సంగ్రామ యాత్రతో బయటకి తీసుకొచ్చి రాష్ట్రం వెలుపలకి తరిమిన ఘనత ప్రతీ బీజేపీ కార్యకర్తదని అన్నారు. రాష్ట్రంలో ఇక బీజేపీని తట్టుకోవడం సాధ్యం కాదనే కేసీఆర్ ఢిల్లీకి పోయాడని ఎద్దేవా చేశారు.

"ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏకమయ్యారు... దోచుకుందాం.. కమీషన్లు దాచుకుందాం అనుకున్నారు... ప్రజలు తిరస్కరిస్తే జై తెలంగాణ అని కేసీఆర్... జై ఆంధ్రా అని జగన్ అనాలని ఇద్దరు మాట్లాడుకున్నారు. బీఆర్ఎస్ పేరుతో తెలంగాణ తీసేశారు.. దీంతో తెలంగాణకు పట్టిన శని వదిలిపోయింది. ఉద్యమకారులని పక్కనిపెట్టి కేసీఆర్ ఉద్యమద్రోహులతో కలిసి తిరుగుతున్నారు. ఈ విషయాలన్నీ ప్రజలు గుర్తించాలి" అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : ఈటల

కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బ్రహ్మాండం అని చెబుతున్న ప్రాజెక్టు వద్దకి ఎవరు కూడా వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టు ప్రాంతంలో నిత్యం పోలీసుల బూట్ల చప్పుల్లే వినిపిస్తున్నాయన్నారు. వరదలతో కన్నెపల్లి పంప్ హౌస్ లో దెబ్బతిన్న 18 మోటార్లలో ఇప్పటికీ ఒక్కటి కూడా బాగు కాలేదని... అన్నారం పంప్ హౌస్ లో 12 మోటార్లకు గాను కేవలం 4 మాత్రమే నడుస్తున్నాయని.. వాటిని చూపి అంతా సవ్యంగా ఉందని కేసీఆర్ మభ్య పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు రూపాయి బాకీ లేకుండా చెల్లించి.. భూములు కోల్పోయిన వందలాది మంది రైతులకు మాత్రం పరిహారం చెల్లించని దుర్మార్గుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. మార్పునకు నాంది కరీంనగర్ అని .. 2006లో తాను రాజీనామా చేసినప్పుడు తిరిగి గెలిపించి ఈ గడ్డ చైతన్యాన్ని చూపించిందని, హుజూరాబాద్ ఎన్నికలో అదే కొనసాగించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈటల జోష్యం చెప్పారు.

కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ కుట్రలు : ధర్మపురి అరవింద్

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పేరుతో మోదీపై పోరాటం చేస్తానని చెబుతున్న కేసీఆర్ అసలు ఉద్దేశం వేరన్నారు. బీఆర్ఎస్ తో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి.. తెలంగాణలో వారి నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినన్ని సీట్లు రాకపోతే కాంగ్రెస్ అండతో గట్టెక్కొచ్చన్న ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా మేల్కొని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ధైర్యముంటే నిజామాబాద్ లో తనపై పోటీ చేయాలని అరవింద్ సవాల్ విసిరారు. ఆమెకి ధైర్యం లేకపోతే కేసీఆర్ ని పోటీకి పంపాలని అన్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.

IPL_Entry_Point