BRS to Congress : పట్టించుకోని ముఖ్య నేతలు..! కాంగ్రెస్ లోకి వలసలు-joinings in congress party in adilabad district ahead of loksabha polls 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs To Congress : పట్టించుకోని ముఖ్య నేతలు..! కాంగ్రెస్ లోకి వలసలు

BRS to Congress : పట్టించుకోని ముఖ్య నేతలు..! కాంగ్రెస్ లోకి వలసలు

HT Telugu Desk HT Telugu
Jan 15, 2024 02:32 PM IST

Joinings in Congress Party : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకులు… హస్తం కండువా కప్పేసుకుంటున్నారు. ఎన్నికలు వేళ నాయకులు చేజారుతున్న పార్టీ బాధ్యతలు చూస్తున్న ముఖ్య నేతలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయటం లేదు.

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

Joinings in Congress Party : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు కింది స్థాయి నాయకులను, కార్యకర్తలను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుడడంతో వారిలో నైరాశ్యం నెలకొంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓటర్ల తీరుకు అనుగుణంగానే ఆయా రాజకీయ పార్టీల నేతలు సైతం సొంత గూటిని వీడి కండువాలు మార్చేస్తున్నారు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పకడ్బందీగా వ్యూహంతో వలసల కోసం గేట్లు తెరుస్తున్నారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ లోకి నేతలంతా మూకుమ్మడిగా పార్టీ వీడి వెళుతున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యే లు కనీసం వారిని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయకపోవడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే పరిషత్ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, డిసిసిబి చైర్మన్ అడ్డిబోజారెడ్డి, జైనథ్ జడ్పీటీ నీ తుమ్మల అరుంధతి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బిజెపికి చెందిన ఇచ్చోడ ఎంపీపీ తోపాటు మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణినేతలు, మున్సిపల్ చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, కౌన్సిలర్లు స్థానిక సంస్థల ప్ర జాప్రతినిధులు మూకుమ్మడిగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భారీ ఎత్తున బిఆర్ఎస్ నేతలు పార్టీ వీడుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు ఏమాత్రం వారిని అడ్డుకోక పోవడం విస్మయం కలిగిస్తోంది.

ఇటీవలే నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క సమక్షంలోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఉమ్మడి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మరో నాలుగు చోట్ల బిజెపి, ఆసిఫాబాద్, బోథ్ నియోజక వర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్లో కొనసాగి గులాబి తీర్థం పుచ్చుకున్న వారిలో బిఆర్ఎస్ కు చెందిన కొందరు నాయకులు తిరిగి సొంత అవసరాల కోసం కాంగ్రెస్ లో చేరుతున్నారు. నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలను చేర్చుకోబోమని అధినేతలు స్పష్టంగా సంకేతాలు ఇచ్చినప్పటికి లోకసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహాంతో బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఖానాపూర్ నుండి గెలిచిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు వద్దకు బిఆర్ఎస్ నేతలు చేర్చుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. గులాబి పార్టీలో చాలాకాలంగా కొనసాగి పదవులు అనుభవిస్తున్న వారు సైతం పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది.

బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం పనిచేసిన ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పట్టించుకోకపోవడం, కనీసం భరోసా ఇచ్చేవారు లేకపోవడం వల్లే పార్టీ వీడాల్సి వస్తుందని కాంగ్రెస్ లోకి చేరిన పలువురు ఎంపీపీలు, సర్పంచులు ద్వితీయ శ్రేణి నేతలు వాపోతున్నారు. ఇటీవల జరిగిన బిఆర్ఎస్ పార్టీ సమీక్ష సమావేశంలోనూ అధికారం అనుభవించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం క్యాడర్ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీయడం కూడ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని గుణపాఠంగా తీసుకుని పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి కెటీఆర్ ఇటీవల జిల్లా నేతలకు దిశా నిర్ధేశం చేసినప్పటికి ఇక్కడ భవిష్యత్తుపై భరోసా లేకనే తాము పార్టీ వీడాల్సి వస్తుందని నేతలు చెపుతున్నారు.

బెల్లంపల్లిలోనూ….

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 20 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఒకే రోజు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోగా మంచిర్యాల మున్సిపాలిటిలోనూ 15 మంది కౌన్సిలర్లు గులాబి కండువా మార్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయిలో సీనియర్లుగా గుర్తింపు పొంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దొరకక తిరుగుబాటు చేసి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్లు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. టిపిసిసి రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా, ఎఐసీసీ సభ్యురాలిగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో 15 ఏళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించిన గండ్రత్ సుజాతను తిరిగి సొంత గూటికి రావాలని హైదరాబాద్ నుండి పిలుపువచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న ఒకరిద్దరితోపాటు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సుజాతతో టచ్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు మాజీ డిసిసి అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ సంజీవ రెడ్డితో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు సైతం కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఇందు కోసం పార్టీ సీనియర్లు కందిశ్రీనివాస్ రెడ్డికి సంబంధం లేకుండానే చర్చలు జరుపుతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని గెలిపించుకునేందుకు మాజీ సీనియర్లను పార్టీలో చేర్చుకుంటారని ప్రచారం జరుగుతుంది.

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్.

Whats_app_banner