Bonalu Bhavishya Vani: అండగా ఉంటా., భయపడొద్దంటూ “రంగంలో” అమ్మవారి అభయం-jogini swarnalatha assured public with prophetic voice in ujjain mahankalis bonalu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bonalu Bhavishya Vani: అండగా ఉంటా., భయపడొద్దంటూ “రంగంలో” అమ్మవారి అభయం

Bonalu Bhavishya Vani: అండగా ఉంటా., భయపడొద్దంటూ “రంగంలో” అమ్మవారి అభయం

HT Telugu Desk HT Telugu

Bonalu Bhavishya Vani: ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

బోనాలులో రంగం వినిపిస్తున్న జోగిని స్వర్ణలత

ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా ఇవాళ రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

బోనాల ఉత్సవాల్లో ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది తనకు ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారన్నారు. కావాల్సిన బలాన్నిచ్చానని.. మీ వెంటా ఉంటానని చెప్పారు.ఈ ఏడాది ఆలస్యమైనా వర్షాలు తప్పకుండా వస్తాయన్నారు.

''అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి..ప్రజలు భయపడ వద్దని అభయం ఇచ్చారు. నా వద్దకు వచ్చే ప్రజలను కాపాడే భారం నాదేనని చెప్పారు. ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునే భాధ్యత నాదేనని, ఐదు వారాలు తప్పనిసరిగా నైవేద్యాలు సమర్పించాలన్నారు. ఏ పూజలు చేసినా సంతోషంగా అందుకుంటున్నానని స్వర్ణలత అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా హాజరయ్యారు. భవిష్యవాణి వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.

రంగం కార్యక్రమం నేపథ్యంలో మహంకాళి ఆలయంలో భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. భవిష్యవాణి వినేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

మరోవైపు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేకే తదితరులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ వచ్చారు.

హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.