SU Job Mela : కరీంనగర్ ఎస్‌యూలో జాబ్ మేళాకు విశేష స్పందన.. 427 మందికి ఉద్యోగాలు
SU Job Mela : కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. హెచ్‌ఆర్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు.. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల తోపాటు పీజీ, బీటెక్ పూర్తి చేసిన 2,649 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ గల 427 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
శాతవాహన యూనివర్సిటీ ఏర్పడి 16 ఏళ్లు అవుతుంది. యూనివర్సిటీ ఏర్పడ్డాక తొలిసారి నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. మెగా జాబ్ మేళాను రిటైర్డ్ విసీ చిరంజీవులు ప్రారంభించారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన జాబ్ మేళాకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు.
డిగ్రీ, బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోపాటు.. పీజీ, ఎంటెక్ చేస్తున్న విద్యార్థులు హాజరయ్యారు. 2,659 మంది హాజరు కాగా.. హెచ్‌ఆర్ కంపెనీ ఆధ్వర్యంలో 50 కంపెనీలు పాల్గొని 427 మందిని ఎంపిక చేసుకున్నాయి. మరో 845 మందిని షార్ట్ లిస్ట్ చేశారు.
త్వరలో మరో జాబ్ మేళా..
యూనివర్సిటీలో తొలిసారి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని.. త్వరలోనే మరో జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ చెప్పారు. ఏటా రెండు మూడు జాబ్ మేళాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వివరించారు.
జాబ్ మేళాలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారితో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విశ్వవిద్యాలయంలో లా కోర్స్ తోపాటు.. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.
ప్రముఖ కంపెనీలు..
శాతవాహన విశ్వవిద్యాలయం లో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో.. జెన్ ఫ్యాక్ట్, కాగ్నిజెంట్, టెలి పెర్ఫార్మెన్స్, సదర్ ల్యాండ్, ఎమ్మెస్ ఎన్ లాబరేటరీ ల్యాబ్స్, అపోలో ఫార్మసీ, ఎంఆర్ఎఫ్ టైర్స్, హెచ్‌డీబీ ఫైనాన్స్ సర్వీసెస్, ఐడీబీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్ బ్యాంక్ లిమిటెడ్, పార్లే అగ్రో ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ లైఫ్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీలు పాల్గొన్నాయి. యూనివర్సిటీలో మెగా జాబ్ మేళా నిర్వహించడం పట్ల విద్యార్థులతో పాటు పేరెంట్స్ హర్షం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)