Zahirabad Fraud: జహీరాబాద్ లో కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టిన నగల వ్యాపారి, రూ.80లక్షల లూటీ, ముగ్గురి అరెస్ట్
Zahirabad Fraud: జహీరాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురి నుంచి సుమారు రూ. 80 లక్షలు ఎగ్గొట్టి పారిపోయిన నిందితులను జహీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో జహీరాబాద్ పట్టణానికి ఒకే కుటుంబానికి చెందిన నేరస్తులు మహబూబ్ బాషా, అఫ్రిది బాషా , సందాని భాషలున్నారు.
Zahirabad Fraud: జహీరాబాద్‌లో జనానికి కుచ్చు టోపీ పెట్టిన ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. సందాని భాష ఆతని ఇద్దరు కుమారులైన మహబూబ్ బాషా, అఫ్రిది భాషలు 30 సంవత్సరాల నుండి జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిర్ రోడ్డులో "ఎస్ఎండీ జువెలర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్" పేరుతో బంగారం వెండి వ్యాపారం నిర్వహించారు. కస్టమర్ల ఆర్డర్ ప్రకారం వారి వద్ద నుంచి డబ్బులు, బంగారం తీసుకోని వారు చెప్పిన ప్రకారము బంగారు అభరణములు తయారు చేసి ఇస్తూ ఉండేవారు.

నమ్మకాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం..
చాలా సంవత్సరాలుగా పట్టణంలో నగల వ్యాపారం, తయారీలో మంచి పేరున్న భాషా కుటుంబానికి, చాల మంది నమ్మకమైన కస్టమర్లు ఉన్నారు. వారు చాల ముందుగా డబ్బులు చెల్లించి నగలు చేయించుకునేవారు. ఆ నమ్మకాన్ని సొమ్ముచేసుకునే ప్రయత్నం భాషా కుటుంబం కుట్ర చేసింది.
రెండు సంవత్సరాల నుండి కస్టమర్ల వద్ద నుంచి బంగారం , పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని సందాని బాషా, తన బావమరిదైన మహ్మద్ ఖాన్ తో కలిసి డబ్బులను జల్సాలకు వాడుకున్నారు.
వరంగల్ కు కుటుంబం తో సహా పారిపోయి
చివరిగా కస్టమర్లకు వారి దుకాణం అమ్మి కొంత మందికి డబ్బులు తిరిగిచ్చారు. వారి దగ్గర డబ్బులు లేకపోవటం వలన మిగతా వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితిల్లో కుటుంబం సమేతంగా వరంగల్ కు పారిపోయారు. సోమవారం మిగిలిన సామాన్లు తీసుకోవడానికి జహీరాబాద్ కు తిరిగొచ్చిన నేరస్తులను డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, జహీరాబాద్ టౌన్ సీఐ. యస్.శివలింగం ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నేరస్థులైన మహబూబ్ బాషా, అఫ్రిది బాషా , సందాని బాష లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ. కాశీనాథ్ తెలిపారు.
డబ్బులు, బంగారం రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు..
నిందితుల నుండి డబ్బులు, బంగారం రికవర్ చేసి, బాధితులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి మోసాలకు పాల్పడినా కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.