Water From Neem Tree : జనగామ జిల్లాలో వింత ఘటన, వేప చెట్టు నుంచి నీళ్ల ప్రవాహం
Water From Neem Tree : జనగామ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. వేప చెట్టు నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నేలకూలిన భారీ వేపచెట్టు మొదలు నుంచి దాదాపు పావు గంట సేపు నీళ్ల ప్రవాహం కొనసాగింది.
Water From Neem Tree : జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నేల కూలిన ఓ భారీ వేప చెట్టును తొలగించే పనులు చేస్తుండగా.. చెట్టు కాండం నుంచి నీళ్ల వరద మొదలైంది. దీంతో గ్రామస్థులంతా షాక్ అవ్వగా.. దానికి సంబంధించిన వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో ఉన్న దాదాపు 150 ఏళ్ల కిందటి వేప చెట్టు రెండు రోజుల కిందట నేల కూలింది. రోడ్డు పక్కనే పడి ఉండటంతో గ్రామ సిబ్బంది దానిని తొలగించే పనులు చేపట్టారు. ఎలక్ట్రిక్ రంపంతో ఆ భారీ చెట్టు మొదలు తొలగించే పని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా చెట్టు మొదలు తొలగిస్తుండగా..జల ధార మొదలైంది. దానిని అలాగే కట్ చేయడంతో ఒక్కసారిగా వరదలా నీరు ఉబికి వచ్చేసింది. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. దాదాపు పావు గంట పాటు వేప చెట్టు నుంచి నీళ్లు బయటకు రాగా.. ఆ ప్రవాహం వరదను తలపించింది. అక్కడున్న వాళ్లంతా జల ధారను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో విషయం ఒకరి నుంచి ఒకరు తెలుసుకుని.. చుట్టుపక్కల గ్రామాలకు చేరడంతో వారంతా తండోపతండాలుగా అక్కడికి తరలి వచ్చారు.
ఈ తతంగాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆ నీళ్లను వేప కల్లుగా భావించి కొంతమంది తాగడానికి ఎగబడ్డారు. తాగిన వాళ్లు నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయని తెలిపారు. కాగా వేప చెట్టు నుంచి నీళ్ల వరద రావడంపై వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. కొన్ని చెట్లకు నీళ్లను నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని, అందుకే అడపా దడపా చెట్ల నుంచి నీళ్లు, కల్లు లాంటి ద్రావణాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేప, కొబ్బరి, ఫామాయిల్, నల్లమద్ది లాంటి చెట్లకు ఇలాంటి స్వభావం ఉంటుందని తెలిపారు.
గతంలో కింటుకూరు అటవీ ప్రాంతంలో
గత మార్చి నెలలో కూడా ఇలాంటి ఘటనే పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. రంపచోడవరం అటవీశాఖ అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఓ నల్లమద్ది చెట్టు నుంచి నీళ్ల చుక్కలు రావడం గమనించారు. ఆ నీళ్ల చుక్కలు వచ్చే చోట కత్తితో గాట్లు పెట్టగానే వెంటనే నీళ్ల ధార బయటకు వచ్చింది. దాదాపు 20 లీటర్ల వరకు నీళ్లు బయటకు రాగా.. ఈ ఘటనపై అటవీశాఖ రేంజ్ అధికారులు స్పందించారు. నల్లమద్ది చెట్టుకు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం