Jagtial Crime : పార్క్ చేసిన బైకులే టార్గెట్...! పోలీసులకు చిక్కిన దొంగల ముఠా-jagtial police arrested bike lifting gang ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : పార్క్ చేసిన బైకులే టార్గెట్...! పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

Jagtial Crime : పార్క్ చేసిన బైకులే టార్గెట్...! పోలీసులకు చిక్కిన దొంగల ముఠా

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 09, 2025 01:35 PM IST

ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5 ద్విచక్రవాహనాలతో పాటు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ వెల్లడించారు.

దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్

జగిత్యాల ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో తిప్పన్నపేటకు చెందిన పెద్ది రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. 

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఒక కారులో వస్తున్న ఐదుగురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా… వారి దొంగతనాల చిట్టా బయటికి వచ్చింది.

ముఠాగా ఏర్పడి చోరీలు….

వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో స్థానికంగా ఉన్న గ్రామాల్లో తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. పెంబట్లు, వెలనగూర్, బెల్గాల్, తిప్పన్నపేటలోని మరో గ్రామంలో కూడా బైక్ లను చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేశ్, సంపతి కుమారస్వామి, బుర్ర రాజేందర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుల వద్ద నుంచి 5 బైకులు, క్రేటా కార్, 5 ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీరిని కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ తరలిస్తామని పేర్కొన్నారు.

నిందితులను చాకచక్యంగా పట్టుకొని టూ వీలర్ బైక్లను రికవరీ చేసిన జగిత్యాల రూరల్ సీఐ కృష్ణా రెడ్డి, ఎస్సై సధాకర్ తో పాటు కానిస్టేబుల్ శ్రీనివాస్,గంగాధర్,రాహుల్, ఉమర్, మోహన్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

Whats_app_banner

సంబంధిత కథనం