Land Dispute Murder : రక్త సంబంధాన్ని తెంచేసిన భూతగాదా, జగిత్యాల జిల్లాలో అన్నను నరికి చంపిన తమ్ముడు
Land Dispute Murder : భూ తగాదా అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. అన్నపై కక్షగట్టిన తమ్ముడు చివరకు కత్తితో దాడి చేసి, అన్నను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
భూ వివాదాలతో ఎంతటికైనా తెగిస్తున్నారు. రక్త సంబంధాలను సైతం తెంసేసుకుంటున్నారు. భూమి విషయంలో గొడవ పడ్డ ఇద్దరు అన్నదమ్ములు ఠాణా మెట్లెక్కిన సమస్య పరిష్కారం కాలేదు. చివరకు అన్నను తమ్ముడు తల్వార్ తో మెడ నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన పల్లెపు చందు, పల్లెపు సాయిలు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య గత కొద్దిరోజులుగా భూ తగాదా నడుస్తుంది. ఈ నేపథ్యంలో గొడవపడి కొట్టుకోవడంతో ఇద్దరిపై మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న చందు, ఎట్లైనా సరే తన అన్నను హతమార్చాలనుకున్నాడు. పథకం ప్రకారం ఆదివారం ఒబులాపూర్ సమీపంలోని గోదావరి ఒడ్డున అన్న సాయిలున్నాడన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళిన తమ్ముడు చందు తల్వార్ తో దాడికి పాల్పడ్డాడు. మెడ నరికి చంపాడు. దీంతో తల మొండెం వేరయ్యాయి. ఈ దారుణ హత్య స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
హత్యతో ఉద్రిక్తత
అన్నను తమ్ముడు నరికి చంపాడనే విషయం తెలిసి అన్న కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రతికారం తీర్చుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హత్య చేసిన తమ్ముడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు అన్న బంధువులు. చందు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుని చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు.
15 రోజులు.. 9 హత్యలు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 రోజుల్లో మొత్తం 9 హత్యలు జరిగితే అందులో 8 రక్తసంబంధీకుల మధ్య జరిగినవే కావడం విపరీత ధోరణికి అద్దం పడుతోంది. పెరుగుతున్న ఆస్తుల విలువ, మద్యం, వివాహేతర సంబంధాలు, అసూయ తదితరాలు కుటుంబ బంధాల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. సోదరుల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి. భార్యాభర్తలు కొందరిలో చిన్న చిన్న కారణాలే హత్యలకు దారితీస్తున్నాయి. ఇటీవల జరిగిన రక్త సంబంధీకుల హత్యల్లో జగిత్యాల జిల్లాలో మూడు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు చొప్పున హత్యలు జరగగా పెద్దపల్లి జిల్లాలో ఒక హత్య కేసు నమోదైంది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం