Jagtial Crime : స్క్రాప్ వ్యాపారి ప్లాన్ ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు అమలు, జగిత్యాల జిల్లాలో చోరీ గ్యాంగ్ అరెస్ట్
Jagtial Crime : జగిత్యాల జిల్లాలో ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు, స్క్రాప్ వ్యాపారి కలిసి ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, మోటార్ సైకిళ్లు, కరెంట్ మోటార్లు చోరీలకు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Jagtial Crime : తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, కరెంటు మోటార్ల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. మెట్‌పల్లి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన దొంగతనాల కేసులలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లు, మోటార్ సైకిళ్లు, వ్యవసాయ కరెంటు మోటార్ల దొంగతనాలపై ప్రత్యేక నిఘా పెట్టి...డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో, మెట్‌పల్లి సీఐ రంజన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ బృందం సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై అనిల్ తన సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీలలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు మెట్‌పల్లికి చెందిన స్క్రాప్ వ్యాపారితో కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులు మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన వస్తువులను స్క్రాప్ వ్యాపారికి విక్రయించి, డబ్బులు పంచుకునేవారు.
ట్రాక్టర్ డ్రైవర్లు, స్క్రాప్ వ్యాపారి ముఠా
నిందితుడు కుంచేపు వెంకటేష్ మెట్‌పల్లిలో ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ జీవించేవాడు. వచ్చిన డబ్బులు అతని కుటుంబానికి, జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. కోరుట్ల పోలీస్ స్టేషన్ (6), మెట్ పల్లి పోలీస్ స్టేషన్ (2) పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో మళ్లీ దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఒక గ్యాంగ్ రేప్ కేసులో కూడా ముఖ్యమైన నిందితుడిగా ఉన్నాడు.
మరో నిందితుడు సూర్యవంశీ సాయికుమార్ నిజామాబాద్ జిల్లా రాఘవపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్. ట్రాక్టర్ నడపడంలో వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు, జల్సాలకు సరిపోక నిందితుడు కొంచెం వెంకటేష్ తో కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. మెట్‌పల్లి రెడ్డి కాలనీకి చెందిన అబ్దుల్ బారి గత కొంత కాలం నుంచి మెట్ పల్లి పట్టణంలో స్క్రాప్ బిజినెస్ పేరుతో వ్యాపారం నిర్వహించేవాడు. ఇతడు దొంగిలించిన సొత్తును కొనేవాడు. ఈ ముగ్గురు కలిసి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారు.
రూ.6 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
నిందితుల నుంచి రూ.6 లక్షలు విలువగల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒక మోటార్ సైకిల్, 30 కిలోల కాపర్ వైర్, 30 వ్యవసాయ కరెంటు మోటార్లు. రూ.5,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన డీఎస్పీ రాములు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై అనిల్, ఎస్సై కిరణ్, ఎస్సై రాజు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
సంబంధిత కథనం