Jagtial Peacock Hunting : నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్పీ తండ్రి అరెస్ట్-తుపాకీతో పాటు 34 బుల్లెట్లు స్వాధీనం!
Jagtial Peacock Hunting : నెమలిని వేటాడిన కేసులో ములుగు డీఎస్సీ తండ్రితో పాటు మరో యువకుడిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి తుపాకీ, 34 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే డీఎస్పీ తండ్రి గతంలో జింకను వేటాడిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Jagtial Peacock Hunting : జగిత్యాల జిల్లాలో నెమళ్ల వేట (Peacock Hunting)వెలుగులోకి వచ్చింది. తుపాకీతో నెమలిని వేటాడి చంపిన ఇద్దరిని పెగడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో ములుగు డీఎస్పీ(Mulugu DSP Father) తండ్రి ఉండడం కలకలం సృష్టిస్తుంది. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన నలువాల సత్యనారాయణ(63), మల్యాల మండల కేంద్రానికి చెందిన జవ్వాజి రాజు (33) ఇద్దరు పెగడపల్లి మండలం దోమలకుంట శివారులో తుపాకీతో నెమలిని కాల్చి చంపారు. నెమలిని కారులో తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. వారి నుంచి కాల్చి చంపిన నెమలితోపాటు 0.22 SPORTING RIFLE అని రాసి ఉన్న తుపాకీ, 34 తూటలు, ఒక గొడ్డలి, AP15 BN 8093 నెంబర్ గల కారును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, లైసెన్స్ లేకుండా తుపాకీతో ఫైరింగ్ చేయడంపై ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వన్యప్రాణిని వేటాడిన ఇద్దరిని పట్టుకున్న పెగడపల్లి పోలీసులను జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
2017 లో జింకను వేటాడిన కేసులో నిందితుడు
ప్రస్తుతం నెమలిని వేటాడి(Peacock hunting) పట్టుబడ్డ సత్యనారాయణ 2017లో భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జింకను వేటాడిన కేసులో ప్రధాన నిందితుడు. అప్పట్లో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన తీరు అతడు మార్చుకోలేదు. తుపాకీతో వన్యప్రాణుల వేటాడటం అలవాటుగా మార్చుకున్న సత్యనారాయణ తన డ్రైవర్ తో కలిసి తాజాగా నెమలిని తుపాకీతో కాల్చి చంపాడని జగిత్యాల డీఎస్పీ తెలిపారు. సత్యనారాయణపై వన్యప్రాణుల సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
లైసెన్స్ గన్ లు పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలి
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయితే మార్చి 25లోపు లైసెన్స్ తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయాలని పోలీసులు సూచించారు. తుపాకులు డిపాజిట్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నెమలి వేట కేసులో డీఎస్పీ తండ్రి అరెస్టు అయ్యారు. ఈ ఘటనలో లైసెన్స్ గన్ డీఎస్పీకి చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఆయనపై కూడా శాఖపరమైన చర్యలు తప్పమని పోలీసులు అంటున్నారు. తన గన్ కుటుంబ సభ్యులు వినియోగించడంలో డీఎస్పీ నిర్లక్ష్యం కూడా ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ ఘటనపై ములుగు డీఎస్పీ ఇంకా స్పందించలేదు.
సంబంధిత కథనం